బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం (జనవరి 31) పరాకాష్టకు చేరింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే బంగారంపై ఏకంగా రూ. 1.8 లక్షల మేర సంపద ఆవిరి కావడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన బలహీన సంకేతాలే ఈ చారిత్రాత్మక పతనానికి ప్రధాన కారణమయ్యాయి.
హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు భారీగా క్షీణించాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 8,620 తగ్గి రూ. 1,60,580 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 7,900 తగ్గి రూ. 1,47,200కి చేరుకోగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,20,440 వద్ద ఉంది. ఒక్క రోజులోనే బంగారంపై 10 శాతం వరకు ధర తగ్గడం మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద క్రాష్‌గా నిలిచింది.
బంగారంతో పోటీగా వెండి ధర కూడా నేలచూపులు చూస్తోంది. కేవలం 48 గంటల్లోనే వెండి ధర సుమారు 20 శాతం వరకు పడిపోయింది. నేడు కిలో వెండి ఏకంగా రూ. 45,000 తగ్గి రూ. 3,50,000 వద్ద మార్కెట్ అవుతోంది. అంతర్జాతీయంగా వెండి ధర 26 శాతం కంటే ఎక్కువ క్షీణించడం భారత మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. జనవరి మొదట్లో విపరీతంగా పెరిగిన వెండి, ఇప్పుడు చివరలో అంతే వేగంగా పతనమవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్ల కంటే దిగువకు పడిపోవడం భారత మార్కెట్లను కుప్పకూల్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠినంగా వ్యవహరించవచ్చన్న సంకేతాలు, డాలర్ ఇండెక్స్ మళ్ళీ పుంజుకోవడం ఇన్వెస్టర్లలో భయాందోళనలను పెంచాయి.
దీనివల్ల సేఫ్ హేవన్ ఆస్తులైన బంగారం, వెండి నుండి పెట్టుబడిదారులు తమ సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు. ధరలు తగ్గుతున్నప్పటికీ, మన దేశంలో బంగారం కొనుగోలుకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్ ప్రీమియంలు రికార్డు స్థాయికి చేరడం విశేషం. సామాన్య కొనుగోలుదారులకు ఈ ధరల తగ్గుదల గొప్ప ఉపశమనాన్ని ఇస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates