భారత క్రికెట్‌లో సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వారసుడు దొరికాడనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
కేవలం 14 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి, యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 12 బంతుల ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును దాదాపుగా తాకినంత పని చేశాడు. గురువు శిక్షణలో రాటుదేలిన ఈ శిష్యుడు మైదానంలో పవర్ హిట్టింగ్‌తో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అభిషేక్ శర్మ వీరవిహారం చూసిన గురువు యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా సరదాగా స్పందించారు. “నేను 12 బంతుల్లో కొట్టిన 50 రికార్డును నువ్వు ఇంకా బద్దలు కొట్టలేవు, నీవల్ల అవుతుందా?” అంటూ ఆటపట్టిస్తూనే, శిష్యుడి అద్భుత ప్రదర్శనను అభినందించారు. “వెల్ ప్లేడ్.. ఇలాగే బలంగా దూసుకుపో” అంటూ తన ప్రియ శిష్యుడికి ఆశీస్సులు అందించారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ అనుబంధం అటు అభిమానులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.
మ్యాచ్ అనంతరం తన గురువు రికార్డ్ పై అభిషేక్ శర్మ వినమ్రంగా స్పందించాడు. “యువరాజ్ పాజీ రికార్డును బద్దలు కొట్టడం ఎవరికైనా దాదాపు అసాధ్యం” అంటూ తన గౌరవాన్ని చాటుకున్నాడు. అయితే భవిష్యత్తులో ఏ బ్యాటర్ అయినా ఆ స్థాయికి చేరుకోవచ్చని, జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడటమే తన లక్ష్యమని తెలిపాడు. క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే సిక్సర్లు కొట్టడం తన సహజ సిద్ధమైన శైలి అని, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్‌ను బట్టి షాట్లు ఆడతానని వివరించాడు.
అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో జాకబ్ డఫీ బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి 14 బంతుల్లోనే ఫిఫ్టీ మార్కును చేరుకున్నాడు.
అతని బ్యాటింగ్ శైలి, ముఖ్యంగా ఆ L షేప్ సెలబ్రేషన్ చూస్తుంటే యువరాజ్ సింగ్ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కివీస్ బౌలర్లు సైతం వచ్చి అభిషేక్ బ్యాట్‌ను పరిశీలించడం అతని బ్యాటింగ్ పవర్ ఏంటో చెబుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates