టీమిండియా సెలక్షన్ లో పేరు లేకుంటే ‘జస్టిస్ ఫర్ సంజు శామ్సన్’ అనే ట్రెండ్ గత రెండేళ్లలో ఎక్కువగా కనిపించింది. అతనికి టీమ్ ఇండియాలో సరైన అవకాశాలు రావడం లేదని అభిమానులు ఎప్పుడూ వాదిస్తూనే ఉంటారు. అయితే, ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నా వాటిని అందిపుచ్చుకోవడంలో సంజు దారుణంగా విఫలమవుతున్నాడు. న్యూజీలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం గౌహతిలో జరిగిన మూడో టి20లో సంజు గోల్డెన్ డకౌట్ అవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న సంజు శామ్సన్ ఇప్పటివరకు 10, 6, 0 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు. మూడో టి20లో మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. గడిచిన 18 టి20 ఇన్నింగ్స్‌లలో సంజు సగటు కేవలం 17 మాత్రమే ఉండటం అతని ఫామ్ ఎంత దారుణంగా ఉందో చెబుతోంది. ఐపీఎల్‌లో హీరోగా మెరిసే సంజు, జాతీయ జట్టుకు వచ్చేసరికి ఆ కన్సిస్టెన్సీని ప్రదర్శించలేకపోతున్నాడు.
సంజుకు మిడిల్ ఆర్డర్ సెట్ అవ్వదని, ఓపెనింగ్‌లో అతనికి ఫ్రీడమ్ ఉంటుందని భావించి టీమ్ మేనేజ్మెంట్ మళ్ళీ ఓపెనర్ అవకాశం ఇచ్చింది. కానీ, అక్కడ కూడా అతను ప్రభావం చూపలేకపోతున్నాడు. గతేడాది నవంబర్‌లో సౌత్ ఆఫ్రికాపై సెంచరీ (109*) చేసిన తర్వాత, ఫుల్ మెంబర్ దేశాలపై సంజు ఒక్క అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు. చివరిసారిగా గతేడాది ఆసియా కప్‌లో ఒమన్‌పై మాత్రమే అతను యాభై పరుగుల మార్కును దాటాడు.
వరల్డ్ కప్‌కు కొద్ది రోజులే సమయం ఉండటంతో సంజు వైఫల్యాలు టీమ్ ఇండియాకు తలనొప్పిగా మారాయి. సోషల్ మీడియాలో సంజు సపోర్టర్స్ కూడా ఇప్పుడు అతని ఆట తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఒక మ్యాచ్‌లో రాణించి మళ్ళీ పది మ్యాచ్‌ల వరకు నిలకడ చూపించకపోవడం వల్ల అతను తన స్థానాన్ని రిస్క్‌లో పడేసుకుంటున్నాడు. బుధవారం విశాఖపట్నం వేదికగా జరగనున్న నాలుగో టి20 మ్యాచ్ సంజు కెరీర్‌కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లోనైనా అతను తన పాత ఫామ్‌ను అందుకుని భారీ స్కోరు సాధించకపోతే, జట్టులో అతని స్థానం ప్రశ్నార్థకంగా మారుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates