పెళ్లంటే ఆడంబరాలకు మారు పేరుగా మారిపోయిన రోజులు ఇవి. ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే.. ఎంత ఘనంగా చేసుకుంటే అంత గొప్ప అన్నట్లు అయిపోయింది. పెద్దగా డబ్బులు లేని వాళ్లు సైతం అప్పులు చేసి అయినా ఘనంగా పెళ్లిళ్లు చేయడానికి చూస్తున్నారు. ఇలా చేయడం కరెక్టా కాదా అన్నది వేరే చర్చ.
కుటుంబంలో ఎన్నో ఏళ్లకు ఒకసారి జరిగే శుభకార్యాన్ని కొంచెం ఘనంగా చేసుకుంటే తప్పేంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. సరిగా పెళ్లి చేయకపోతే చెడ్డ పేరు వస్తుందనే భయాలు కూడా ఉంటాయి. ఐతే కొందరు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. తమ హోదా గురించి ఆలోచించకుండా సింపుల్‌గా వివాహ వేడుకను పూర్తి చేస్తారు. తాజాగా ఇద్దరు ఉన్నతాధికారులు ఇదే పని చేశారు.
తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి.. ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి తమ వివాహాన్ని ఏమాత్రం ఆడంబరం లేకుండా చాలా సింపుల్‌గా చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వీళ్లిద్దరూ భద్రాత్రి భువనగిరి జిల్లా.. హైదరాబాద్ సమీపంలోని చౌటుప్పల్‌లో దండలు మార్చుకుని పెళ్లి తంతును పూర్తి చేశారు.
ఇందుకు చౌటుప్పల్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా నిలిచింది. శ్రీకాంత్, శేషాద్రిని తమ కుటుంబాలకు చెందిన కొద్ది మంది సభ్యుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న వీడియో వైరల్ అయింది. కుటుంబ సభ్యుల చప్పట్లే వారికి మేళతాళాలయ్యాయి.
కొందరు సీనియర్ అధికారులు కూడా ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి ఖుత్బుల్లాపూర్ డీసీపీగా ఉన్నారు. ఆమె స్వస్థలం లింగారెడ్డి గూడెం. శ్రీకాంత్ రెడ్డి స్వస్థలం కడప. ఆయన ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న ఈ జంటపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates