న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా, భారత్ మరో 28 బంతులు మిగిలి ఉండగానే కేవలం 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి కివీస్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు నాన్ స్టాప్ గా చెలరేగిపోయారు.
అభిషేక్ శర్మ డకౌట్ అయినా, సంజూ శామ్సన్ (6) త్వరగా నిష్క్రమించినా భారత్ ఎక్కడా తడబడకుండా లక్ష్యం వైపు దూసుకెళ్లింది. ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు.
అతనికి తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో శివం దూబే 18 బంతుల్లో 36 పరుగులు చేసి మ్యాచ్‌ను వేగంగా ముగించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేయడంలో కొంత తడబడ్డారు. కివీస్ బ్యాటర్లలో మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్), రచిన్ రవీంద్ర (44) రాణించడంతో ఆ జట్టు 208 పరుగులు చేయగలిగింది.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (1/35), కుల్దీప్ యాదవ్ (2/35), హార్దిక్ పాండ్యా (1/25), హర్షిత్ రాణా (1/35) శివం దూబే (1/7) వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ వికెట్ తీయలేకపోయినా, ఇతర బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్‌ను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
కివీస్ బౌలింగ్ విభాగంలో జాకబ్ డఫీ (1/38), మ్యాట్ హెన్రీ (1/41), ఇష్ సోధి (1/34) తలా ఒక వికెట్ తీసినప్పటికీ భారత బ్యాటర్ల విధ్వంసాన్ని ఆపలేకపోయారు. ముఖ్యంగా జకారి ఫౌల్కెస్ తన 3 ఓవర్లలో ఏకంగా 67 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టి20లోనూ రాణించిన డఫీ, ఈ మ్యాచ్‌లో కూడా పర్వాలేదనిపించినా ఇతర బౌలర్ల నుంచి సహకారం అందకపోవడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. మొత్తానికి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పుడు 2-0 ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న టీమిండియా బౌలింగ్ లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates