కేరళ బస్సుల్లో మగవారి ప్రయాణం చూసారా…

కేరళ రాష్ట్రంలో ఇప్పుడొక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం అక్కడ పెను దుమారం రేపుతోంది. ఒక మహిళ అకారణంగా తన మీద నింద వేసి, మానసిక క్షోభకు గురి చేయడం అతడి ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో కేరళలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న పురుషులందరూ విచిత్ర రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..?

కొన్ని రోజుల కిందట షింజిత ముస్తఫా అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. తన ఇన్‌స్టా పేజీలో ఒక వీడియోను షేర్ చేశారు. బస్సులో తనతో కలిసి ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తనను అసభ్యంగా తాకుతున్నట్లుగా ఆమె ఆరోపించారు. ఐతే ఆ వీడియోలో ఆ ఉద్దేశపూర్వకంగా ఆ మహిళను తాకుతున్న సంకేతాలేమీ లేవు. ఆమే అతడికి దగ్గరగా వెళ్లి అతడి చేయి తనకు తాకేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఐతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో ఉన్న వ్యక్తి పేరు దీపక్ అని వెల్లడైంది. అతణ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఒక ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేసే దీపక్.. తాను నివాసముండే కోళికోడ్‌లో, అలాగే పని చేసే కంపెనీలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు.

తన వ్యక్తిత్వాన్ని అందరూ ప్రశ్నించడంతో అతను తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళలో దుమారం రేపింది.

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం షింజిత అకారణంగా ఒక వ్యక్తి మీద నింద వేసి అతడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందంటూ ఆమె మీద ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. దీపక్ తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు షింజిత మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని సమాచారం.

మరోవైపు కేరళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న పురుషులు.. మహిళలకు తాకకుండా అట్ట పెట్టెలను ఒంటికి చుట్టుకుని దీపక్ ఘటన పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీపక్‌కు మద్దతుగా ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి.