భారత విద్యార్థులకు పీడకలగా మారుతోన్న మరో దేశం

ఒకప్పుడు ఉన్నత విద్యకు, కెరీర్‌కు స్వర్గధామంగా కనిపించిన ఐర్లాండ్, ప్రస్తుతం భారతీయ విద్యార్థుల పాలిట పెను సవాలుగా మారింది. అమెరికా, యూకే వంటి దేశాల్లో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో చాలామంది ఐర్లాండ్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు.

గత ఏడాది భారతీయ విద్యార్థుల నమోదులో 30 శాతం పెరుగుదల కనిపించినప్పటికీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదురవుతున్న కఠిన వాస్తవాలు వారిని కుంగదీస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగ మార్కెట్ సంక్షోభం, వీసా స్పాన్సర్‌షిప్ దొరకకపోవడం, అలాగే అక్కడ రోజువారీ ఖర్చులు అధికంగా ఉండడంతో జీవన వ్యయం విద్యార్థుల కలలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.

భారీ స్థాయిలో లోన్లు తీసుకుని ఐర్లాండ్‌లో అడుగుపెట్టిన విద్యార్థులకు నిరంతర ఆందోళన తప్పడం లేదు. ఐర్లాండ్ ఐరోపాలోనే ట్యాక్స్ హెవెన్‌గా, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల ప్రధాన కార్యాలయాలకు నిలయంగా ఉన్నప్పటికీ, స్థానిక మార్కెట్‌లో విదేశీయులకు అవకాశాలు దక్కడం గగనమవుతోంది.

వేలాది దరఖాస్తులు చేసుకున్నా ఇంటర్వ్యూ కాల్స్ రాకపోవడం, అర్హత కంటే వీసా హోదాకే కంపెనీలు ప్రాధాన్యత ఇవ్వడం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోంది. అప్పులు తీర్చడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం గంటల తరబడి శ్రమించాల్సి వస్తోంది.

మరోవైపు ఐర్లాండ్‌లో అద్దెకు రూమ్స్ కూడా దొరకడం లేదు. చిన్న గదికి కూడా దాదాపు 80 వేల రూపాయల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోందని, కొన్నిసార్లు డబ్బు తీసుకుని కూడా మోసం చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీనికి తోడు పెరిగిన ఆర్థిక ఒత్తిళ్ల వల్ల వలసదారులపై స్థానికుల్లో వ్యతిరేకత మొదలైంది.

బహిరంగ ప్రదేశాల్లో బెదిరింపులు, జాతి వివక్ష ఎదురవుతున్నాయని, కొందరు విద్యార్థులు ప్రాణహాని ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డకట్టే చలి, ఒంటరితనం విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

ప్రస్తుతం అటు ఐర్లాండ్‌లో ఉండలేక, ఇటు ఇండియాకు తిరిగి రాలేక విద్యార్థులు నలిగిపోతున్నారు. అప్పుల భారం వల్ల వెనక్కి వెళ్లడం సాధ్యం కావడం లేదు, ఉండటానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. ఐర్లాండ్‌ను కేవలం ఒక ట్రెండ్‌లా భావించి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, వీసా సవాళ్లు, సంక్షోభం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగు వేయాలని వారు హెచ్చరిస్తున్నారు.