సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో పచ్చటి పొలాలు..గొబ్బిళ్లు…కళ్లాపి జల్లి రంగురంగుల ముగ్గులు వేసిన లోగిళ్లు…వాటితో పాటు కోడి పందేలు కామన్. ఓ వైపు కోడి పందేలు వద్దని కోర్టులు చెబుతున్నప్పటికీ…ప్రభుత్వాలు, పోలీసులు కూడా పందేలను ఆపలేని పరిస్థితి.
కోడి పందేలు కూడా సంక్రాంతి పండుగ సంస్కృతిలో ఓ భాగమని పందెం రాయుళ్లు చెబుతూ కోట్ల కొద్దీ పందేలు కడుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ నాడు ఓ పందెం రాయుడు జాక్ పాట్ కొట్టాడు. కోడి పందెంలో గెలిచి కోటిన్నర పట్టుకుపోయాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో రెండో రోజు కూడా కోడి పందేలు కొనసాగాయి. ఈ క్రమంలోనే పై బోయిన వెంకటరామయ్య బరిలో రూ.1.53 కోట్లకు కోడి పందెం జరిగింది. గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ ల మధ్య ఈ పందెం నిర్వహించారు.
ఈ పందెంలో ప్రభాకర్ కు చెందిన ‘సేతువ’ కోడిపై రమేష్ కు చెందిన ‘డేగ’ కోడి విజయం సాధించింది. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే భారీ పందెం అట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
దీంతో, నెటిజన్లు ఈ పందేలపై భిన్నంగా స్పందిస్తున్నారు. కోడి పందేలు చట్టరీత్యా నేరం అని, అయినప్పటికీ అన్ని ప్రభుత్వాలు వాటిని ఆపేందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు అంటున్నారు. బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వాలు కోడిపందేలపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శిస్తున్నారు. కోడి పందేలలో కూడా లక్షలు పోగొట్టుకొని కుటుంబాలు చిన్నాభిన్నమైన ఘటనలున్నాయని గుర్తు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates