పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేసి కోడిపందాలు నిర్వహించడం, వాటిని అడ్డుకుంటామని ప్రకటించడం సర్వసాధారణంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో, సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు నిర్వహించడం ద్వారా జంతుహింస జరుగుతున్నట్లు, తాజాగా హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లలో అక్రమ మద్యం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిలుపుకోవాలని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కోడిపందేలు నిర్వహించే వారిపై జంతుహింస నిరోధక చట్టం 1960 మరియు ఏపీ జూద నిరోధక చట్టం 1974 కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలకు చట్ట నిబంధనలపై అవగాహన కల్పించాలని, అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయవచ్చని, విఫలమైన తహసీల్దార్లు, పోలీస్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా స్థాయి తనిఖీ బృందాలు, తహసీల్దార్, ఎస్పీ, జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధులు మరియు స్వచ్ఛంద ప్రతినిధుల ద్వారా పందేలు, బరులు, సొమ్మును పరిశీలించమని సూచించింది.

మరోవైపు, గోదావరి జిల్లాల్లో 12 నుంచి 16 వరకు కోడిపందేలు భారీ ఏర్పాట్లతో జరగనున్నాయి. ఎల్ఈడి స్క్రీన్లు, వాటర్‌ప్రూఫ్ టెంట్లు, అతిథుల కోసం రూములు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు పండగ వేళకు సొంత ఊర్లకు వచ్చి కోడిపందాలను ఆస్వాదిస్తూ సందడి చేయనున్నారు.

హైకోర్టు సూచనల ప్రకారం, ప్రతి గ్రామంలో చట్ట ఉల్లంఘనలకు సంబంధించి తనిఖీలు జరగనున్నాయి. దీంతో ఇప్పటివరకు సంక్రాంతి ఉత్సాహంతో మంచి ఊపులో ఉన్న పందెం రాయుళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. హైకోర్టు ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తారా..? కోడిపందాలను అడ్డుకుంటారా..? పందెం రాయుళ్లను కట్టడి చేస్తారా..? అనేది మరో రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది.