వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు.. తాజాగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీనారాయణ సతీమణిని మోసం చేశారు. ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లను కొట్టేశారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతాన్ని చూస్తే.. ఎవరైనా ఇట్టే మోసపోయేలా చేసే సైబర్ నేరస్తుల టాలెంట్ కు బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం కలుగకమానదు. ఇంతకూ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ బందిపోట్ల బారిన ఎలా పడ్డారు? అంతలా ఎలా మోసపోయారు? అన్న వివరాల్లోకి వెళితే..
మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ సతీమణి ఉర్మిళకు 2025 నవంబరులో ఆమె వాట్సాప్ కు ఒక మెసేజ్ వచ్చింది. తాము చెప్పినట్లుగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే.. అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు. ఆ మెసేజ్ ను నమ్మిన ఊర్మిల.. తనకు ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవటంతో సైబర్ నేరగాళ్లు సూచించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సైంజ్ 20 అనే వాట్సాప్ గ్రూపులో తన భర్త లక్ష్మీనారాయణ నెంబరును యాడ్ చేయించారు.
గ్రూపులో చేరిన కాసేపటికే ఆమెతో దినేష్ సింగ్ అనే వ్యక్తి మాట్లాడాడు. తాను ట్రేడింగ్ ట్రైనింగ్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. తాను ఐఐటీ ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. అమెరికాలో పీహెచ్ డీ చేశానని.. తాను రాసిన స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్ పుస్తకాన్ని త్వరలో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు. అతడి మాటలను నమ్మిన ఊర్మిళ.. అతడి ట్రాప్ లో చిక్కుకున్నారు.
తాను ట్రేడింగ్ పై ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తూ.. పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సిఫార్సులు చేస్తానని.. వాటిల్లో పెట్టుబడులు పెట్టినోళ్లు ఎంతలా లాభాలు పొందారన్న విషయాన్ని తెలిపేలా కొన్ని స్క్రీన్ షాట్లను గ్రూపులో పోస్టు చేసేవాడు. తాను చెప్పినట్లుగా స్టాక్ లో పెట్టుబడి పెడితే 500 శాతం లాభాలు వస్తాయని చెప్పేవాడు. ఇదే క్రమంలో దినేశ్ శిష్యురాలిగా ప్రియసఖి అనే మహిళ.. దినేశ్ చిట్కాలను పాటించి తాను భారీ లాభాలు పొందినట్లుగా వాట్సాప్ లో పోస్టులు పెట్టేది.
తాను చెప్పినట్లు పెట్టుబడులు పెడితే.. ఐదారు వారాల్లోనే 500 శాతం లాభాలు చూస్తారని చెప్పే దినేశ్.. తన వాట్సప్ గ్రూపులో ఉన్న వారు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేవాడు. తాను నిక్సారైన మనిషిని అని చెప్పేందుకు వీలుగా సెబీ గుర్తింపు పొందిన మొకిన్లీ అనే సంస్థ ద్వారా బ్రోకరేజ్ సేవలు పొందుతున్నట్లుగా నమ్మించాడు. ఇందుకు సంబంధించి కొన్ని నకిలీ పత్రాల్ని పంపాడు. అతడి సూచనలకు అనుగుణంగా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఒక అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని అందులో ట్రేడింగ్ ఖాతా తెరిచేలా చేశాడు.
2025 డిసెంబరు 24 నుంచి జనవరి 5 మధ్యలో 19 విడతలుగా మొత్తం రూ.2.58 కోట్లను ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేసేలా చేశాడు. ఇందుకోసం తన భర్త వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టినమరీ రుణం తీసుకున్న ఆమె.. ట్రేడింగ్ లో చెప్పినట్లే పెట్టుబడి పెట్టారు.
తన ఖాతాలో లాభాలు కనిపిస్తున్నా.. విత్ డ్రా చేసే ఆప్షన్ లేకపోవటంతో మరింత డబ్బు పెట్టుబడి పెడితే తప్పించి డబ్బులు తిరిగి రావని చెప్పటంతో అలా పెంచుకుంటూ పోయి మోసపోయారు. చివరకు తాను మోసపోయిన వైనాన్ని గుర్తించి సైబర్ క్రైం పోర్టల్ లో కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణ మొదలు పెట్టిన సైబర్ క్రైం పోలీసులు.. మోసపోయిన డబ్బును గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates