హమ్మయ్య… కోనసీమ మంటలు చల్లారాయి

కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్‌లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన బ్లోఅవుట్ ఘటన ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో చెలరేగిన మంటలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందాలు అహోరాత్రులు శ్రమించి పూర్తిగా ఆర్పివేశాయి.

ప్రమాద తీవ్రత దృష్ట్యా తొలుత బావి చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకుని, గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక నిపుణులు, అత్యాధునిక అగ్నిమాపక పరికరాలతో మంటలపై దశలవారీగా నియంత్రణ సాధించారు.

మంటలు ఆరిపోయిన అనంతరం ప్రమాద స్థలంలో విరిగిపడిన భారీ యంత్ర సామాగ్రి, ఇనుప శకలాలను క్రేన్ల సహాయంతో తొలగించారు. బావి చుట్టూ ఇంకా అధిక ఉష్ణోగ్రత ఉండటంతో ‘వాటర్ అంబ్రెల్లా’ పద్ధతిలో నిరంతరంగా నీటిని చిలకరిస్తూ శీతలీకరణ చర్యలు చేపట్టారు.

బావిని శాశ్వతంగా నియంత్రించేందుకు ‘వెల్ క్యాపింగ్’ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు కీలకమైన భారీ బ్లోఅుట్ ప్రివెంటర్‌ను బావిపై అమర్చేందుకు ఓఎన్జీసీ సాంకేతిక బృందాలు సిద్ధమయ్యాయి. ఈ పరికరం అమర్చిన వెంటనే గ్యాస్ ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుందని అధికారులు వెల్లడించారు.

బ్లోఅవుట్ ఘటన అదుపులోకి రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు బావి వద్దే నిపుణుల బృందం మకాం వేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తుందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.