కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి గాలిపటాలు ఎగరేయడంలో వచ్చే కిక్కే వేరు. అయితే, గాలిపటం ఎగరేసేందుకు దారాన్ని ఉపయోగిస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు.

కానీ, చైనా మాంజాతో గాలిపటం ఎగరేస్తే మాత్రం మన వినోదం మరొకరికి ప్రాణ సంకటం కావొచ్చు. చైనా మాంజాపై నిషేధం ఉన్నా, వాడొద్దని ఎంత మొత్తుకుంటున్నా చాలామంది వినడం లేదు. ఈ క్రమంలోనే యువకులకు చైనా మాంజా ఎంత ప్రమాదకరమో తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

చైనా మాంజా ఎంత డేంజరో ప్రాక్టికల్ గా చూపించి మరీ అవగాహన కల్పిస్తున్నారు. ఓ పిల్లవాడి ముందు చైనా మాంజాతో దోసకాయ కట్ చేసి చూపించారు మలక్ పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై కే. రాము.

ఆ మాంజా ఎంత పదునుగా ఉందో చూసి ఆ పిల్లాడు షాకయ్యాడు. ఇలాంటి మాంజా ఒక మనిషి మెడకు తగిలితే మెడ కట్ అయి తీవ్రగాయాలపాలవుతాడని వివరించారు. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుందని చెప్పారు.

అంతేకాదు, నిషేధించిన చైనా మాంజా వాడడం నేరమని, అయినా సరే వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబట్టి, ప్రజలందరూ దారాలతో తయారైన గాలిపటాలు మాత్రమే ఎగరేయాలని కోరారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి, పోలీసుల సలహాను ఈ సారైన ప్రజలంతా పాటిస్తారో లేక ఎవరెలా చస్తే మాకెందుకు…మాకు నచ్చినట్లు చైనా మాంజాతోనే పతంగులు ఎగరేస్తాం అని పంతం పడతారా అన్నది వేచి చూడాలి.