ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విషయంలో విశాఖ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) హెల్మెట్ ధరించకపోయినా రూ.1,035 జరిమానా విధిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు, వెనుక కూర్చున్న వారికి హెల్మెట్ లేకపోతే సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి ఈ-చలాన్ జారీ చేస్తున్నారు. దీంతో వాహనదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గత రెండు రోజుల్లో పిలియన్ రైడర్ హెల్మెట్ కారణంగా వేలాది ఈ-చలాన్‌లు జారీ అయినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు 31 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, జనవరి 1 నుంచి ఈ-చలాన్‌ల ప్రక్రియ ప్రారంభించినట్లు ఉన్నతాధికారులు వివరించారు.
ఇదిలా ఉండగా, నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కొద్ది రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘నో హెల్మెట్–నో ఫ్యూయల్’ విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించినప్పుడే పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందిస్తామని స్పష్టం చేశారు. వాహనదారుల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates