రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. పనిచేసేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చేరువయ్యేందుకు ఈ సంవత్సరం అనుకూలంగా మారింది. కొందరు ఎమ్మెల్యేలు వివాదాలకు దూరంగా ఉండి ప్రజలకు చేరువయ్యారు. అదే సమయంలో అభివృద్ధిని నమ్ముకుని ముందుకు సాగుతున్న నాయకులు కూడా కనిపిస్తున్నారు. దీంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగడమే కాక ప్రజలతో దగ్గరయ్యే అవకాశం ఏర్పడింది.
తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తొలిసారి ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలకు చేరువ కావడంలో ముందున్నారు. సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు రాజధానికి సంబంధించిన రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పెదకూరపాడు నుంచి తొలిసారి విజయం సాధించిన భాష్యం ప్రవీణ్ కూడా ప్రజలకు చేరువ కావడంలో సక్సెస్ అయ్యారు. ఆది నుంచే భారీ అంచనాలతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన ఆయన అదే గ్రాఫ్‌ను నిలబెట్టుకుంటున్నారు.
ఇక విశాఖపట్నం నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలోనూ సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని కీలక అంశాలు మినహా మిగిలిన విషయాల్లో వారు విజయవంతమయ్యారనే చెప్పాలి. కలివి ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. ఒకరంటే ఒకరికి పడకపోవడంతో నాయకులు కొంత దూరంగా ఉంటున్నారు. ఈ సమస్యను కూడా పరిష్కరించుకుంటే తిరుగులేని శక్తిగా మారతారనడంలో సందేహం లేదు.
ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ప్రజలకు చేరువ కావడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రూరల్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. నెల నెలా జరిగే పింఛన్ పంపిణీలోనూ పాల్గొన్నారు.
ఇక దెందులూరు, పాలకొల్లు నియోజకవర్గాలు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ముందువరుసలో ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో నాయకులు ప్రజలకు మరింత చేరువ కావడమే కాక గతానికి భిన్నంగా ప్రజాసేవను విస్తరించారు. మొత్తం మీద ఈ ఏడాది ప్రజలకు, ఎమ్మెల్యేలకు మధ్య బంధం బలపడడంలో కీలక అడుగు పడిందనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates