న్యూ ఇయర్ ఆఫర్: మందుబాబుల‌కు ఉచిత ప్ర‌యాణం!

నూత‌న సంవ‌త్స‌రం 2026కు స్వాగ‌తం ప‌లుకుతూ.. 2025కు వీడ్కోలు చెబుతూ.. నిర్వ‌హించుకునే కార్యక్ర‌మాల్లో మందు బాబులు రెచ్చిపోవ‌డం ఖాయం. ముఖ్యంగా హైద‌రాబాద్ వంటి మెట్రో న‌గ‌రాల్లో మందు పార్టీల‌కు నూతన సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పెట్టింది పేరు. దీంతో అనేక బార్లు, రెస్టారెంట్లు.. ఇప్ప‌టికే మందుబాబుల‌కు ఫుల్ బాటిళ్ల‌పై రాయితీలు కూడా ప్ర‌క‌టించాయి. అయితే.. నాణేనికి ఇది ఒక‌వైపే.

మ‌రోవైపు.. మందు తాగి చిందులు వేస్తే ఊరుకునేది లేదని.. బుధ‌వారం పొద్దు పొద్దున్నే హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ మందుబాబుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. రాత్రి 11-1 మ‌ధ్య న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్ర‌త్యేక త‌నిఖీలు ఉంటాయ‌ని చెప్పారు. మందు తాగి వాహ‌నం న‌డిపితే.. భారీ జ‌రిమానాలు విధించ‌డంతో పాటు.. స‌ద‌రు వాహ‌నాల‌ను కూడా జ‌ప్తు చేస్తామ‌న్నారు. అంతేకాదు.. జైలుకు కూడా పంపిస్తామ‌ని హెచ్చరించారు. ఈ ప్ర‌క‌ట‌న న‌గ‌రంలో తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.

ఈ నేప‌థ్యంలో హుటాహుటిన బార్ల య‌జ‌మానుల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బార్ల‌లో మందు తాగిన వారిని ఇంటికి ఉచితంగా చేర్చేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని .. ప్ర‌త్యేకంగా కార్లు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం విశేషం. అయితే..ఈ కార్లు ఎంపిక చేసిన ప్రాంతాల మీదుగానే న‌డ‌వ‌నున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఆయా దారుల్లో మందుబాబులు ప్ర‌యాణించేందుకు వెసులు బాటు క‌ల‌గ‌నుంది.

మ‌రోవైపు.. తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్ కూడా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మందు తాగిన వారు.. త‌మ‌కు ఫోన్ చేస్తే(నెంబ‌రు 8977009804) వారిని సుర‌క్షితంగా ఇళ్ల వ‌ద్ద‌కు తీసుకువెళ్తామ‌ని పేర్కొంది. దీనికి రూపాయి కూడా చార్జ్ చేయ‌బోమ‌ని వెల్ల‌డించింది. అయితే.. ఈ సేవ‌లు కేవ‌లం రాత్రి 11 నుంచి 1గంట మ‌ధ్య మాత్ర‌మే ఉంటాయ‌ని పేర్కొంది. క్యాబ్‌లు, ఆటోలు, ఈవీ బైక్‌లు కలిపి మొత్తం 500 వాహనాలు మందుబాబుల‌కు సేవ‌లు అందించ‌నున్నాయి. అయితే.. వీరి ప్ర‌క‌ట‌న వెనుక బార్ల యాజ‌మాన్యాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది.