చెన్నైలో నాన్ లోకల్ పరిస్థితి ఇదా?

లోకల్ వెర్సస్ నాన్ లోకల్ గొడవలు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు తమ ఉపాధిని దెబ్బ కొడుతున్నారనో.. వాళ్ల వల్ల అశాంతి నెలకొంటోందనో.. ఇంకో కారణంతోనో స్థానికులు వారి మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తుంటారు. ఐతే ఈ వ్యతిరేకత మాటల వరకు పరిమితమైతే పర్వాలేదు. కానీ చేతల్లోకి వెళ్లి దాడులకు పాల్పడడమే దారుణం.

భాష, ప్రాంతాభిమానం అధికంగా ఉండే తమిళనాట.. ఇతర రాష్ట్రాల వాళ్ల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో ఒక తమిళ సెలబ్రెటీనే వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన సంతోష్ నారాయణనన్.. తాజాగా ఎక్స్‌లో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. నాన్ లోకల్ జనాలు, ముఖ్యంగా చిన్న స్థాయి కార్మికులతో లోకల్ గ్యాంగ్స్ ఎంత దారుణంగా వ్యవహరిస్తారో అతను వివరించాడు.

తాను చెన్నైలో పదేళ్ల పాటు ఉన్న ఒక ప్రాంతంలో రాత్రి పూట క్రిమినల్ గ్యాంగ్స్ డ్రగ్స్ తీసుకుని అరాచకాలు చేసేవని సంతోష్ నారాయణన్ వెల్లడించాడు. అమాయకులైన భవన నిర్మాణ కార్మికుల మీద అకారణంగా వీళ్లు దాడులు చేస్తుంటారన్నాడు. పోలీసులు వీరి మీద లాఠీ ఝళిపించినా.. ఏమాత్రం చలించనంత మొద్దుబారిపోయి ఉంటారని సంతోష్ తెలిపాడు.

ఈ గ్యాంగులకు చెందిన వాళ్లందరికీ ఇతర రాష్ట్రాల వాళ్లంటే ద్వేషమని.. అకారణంగా వారి మీద దాడులు చేస్తుంటారని సంతోష్ తెలిపాడు. వీరికి రాజకీయ వర్గాలు, కుల సంఘాల వాళ్లు మద్దతుగా నిలుస్తుంటారని.. వారి అండ చూసుకుని యువకులు అకృత్యాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు సంతోష్.

ఇప్పటికైనా అందరూ మేలుకుని బాధితుల పక్షాన నిలవాలని.. సినిమాల్లో కనిపించే విపరీతమైన హింసకు, వాస్తవ జీవితంలో జరిగే ఘటనలకు మధ్య తేడాను గుర్తించి తనతో సహా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకున్నాడు సంతోష్. ఈ పోస్టు చూసి చెన్నైలో వేరే రాష్ట్రాల వాళ్లు ఇంత దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అనేకమంది ఇది నిజమే అంటూ నాన్ లోకల్స్‌కు బాసటగా నిలుస్తున్నారు.