హద్దు దాటి మాట్లాడి 2 లక్షల సబ్స్క్రైబర్లను పోగొట్టుకున్నాడు

సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే.. హద్దులు దాటి మాట్లాడితే ఏమవుతుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. మహిళల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల విషయం నెలకొన్న వివాదం సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. కొందరు సమర్థించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం గురించి చెబుతూ.. తాను వాడిన అభ్యంతరకర పదాల విషయంలో శివాజీ సారీ చెప్పారు.

ఐతే ‘నా అన్వేషణ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ ప్రపంచ యాత్రికుడిగా మంచి పేరు సంపాదించిన అన్వేష్ ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టాడు. అనసూయకు మద్దతుగా నిలిచాడు. అంత వరకు బాగానే ఉంది కానీ.. ఈ క్రమంలో అతను హద్దులు దాటి మాట్లాడాడు. శివాజీతో పాటు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. బూతులు తిట్టాడు.

అంతే కాక హిందూ పురాణాల జోలికి వెళ్లాడు. హిందూ దేవతలు, రామాయణం, మహాభారతం ప్రస్తావన తీసుకొచ్చి సీతాదేవి, ద్రౌపది పాత్రలను ఉదాహరణగా చెబుతూ వాళ్లు నిండుగా బట్టలు వేసుకున్నా సరే రేప్‌లు జరిగాయన్నాడు. ఇంకా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
ఈ కామెంట్స్ తీవ్ర దుమారానికి దారి తీశాయి.

హిందూ సంఘాల వాళ్లకు ఒళ్లు మండేలా చేశాయి. అతడి మీద పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అన్వేష్‌గా అంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతే కాదు.. అన్వేష్ యూట్యూబ్ ఛానెల్‌ను అన్ సబ్‌స్క్రైబ్ చేయాలని ఒక క్యాంపైనింగ్ మొదలైంది. దీని ప్రభావం గట్టిగానే పడుతోంది.

రెండు రోజుల వ్యవధిలో అన్వేష్‌కు 2 లక్షల సబ్‌స్క్రైబర్లు తగ్గిపోవడం గమనార్హం. ఈ గొడవకు ముందు 25 లక్షలకు పైగా ఉన్న సబ్‌స్కైబర్ల సంఖ్య 23 లక్షల దగ్గరికి వచ్చేసింది. తన వ్యాఖ్యలపై అన్వేష్ సారీ చెప్పినా.. అది ప్రాపర్‌గా లేదు. ఒకటికి రెండు వీడియోలు రిలీజ్ చేసినా జనం తగ్గట్లేదు. అది సారీలా లేదు వార్నింగ్‌లా ఉంది అంటూ అతడి ఛానెల్‌ను అన్ సబ్స్క్రైబ్ చేయడం కొనసాగిస్తున్నారు. తనకు సంబంధం లేని వివాదంలో జోక్యం చేసుకుని అదుపు తప్పి మాట్లాడిన అన్వేష్ అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంటున్నాడు.