ఈ ఏడాది మొత్తం రాష్ట్రంలోని ప్రభుత్వ పాలనను గమనిస్తే మంత్రి నారా లోకేష్ కేంద్రంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే నారా లోకేష్ నిలబడ్డారు. శాఖలతో సంబంధం లేకుండా దాదాపు అన్ని అంశాలను ఆయన దృష్టిలో పెట్టుకొని స్పందించాల్సిన సమయంలో కచ్చితంగా స్పందించారు. తద్వారా ప్రభుత్వంలో లోటు రాకుండా ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎటువంటి గ్యాప్ పెరగకుండా కూడా నారా లోకేష్ ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా మెగా పేరెంట్ మీటింగ్స్(పీటీఎం) ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఇది ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాక్ను అందించింది. అలాగే విదేశాలకు వెళ్లి పెట్టబడులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ కల్పన ఉపాధి కల్పనకు పెద్దపీట వేయగలిగారు. ఇక తన శాఖ పరంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. బాగా పనిచేస్తున్నారని గుర్తించిన ఉపాధ్యాయులను ప్రోత్సహించారు. పనిచేయని వారిని హెచ్చరించారు.
ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ఇటీవల ఉద్యమానికి ప్రయత్నం చేసినప్పుడు వారందరినీ పిలిచి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. తద్వారా ప్రభుత్వం పై వ్యతిరేకత పెరగకుండా చూసుకోవడంలో తన శాఖ పరంగా మంత్రి నారా లోకేష్ మేలైన నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా పార్టీ పరంగా కూడా నాయకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు విభేదాలు ఉన్న నాయకులకు క్లాస్ ఇవ్వడంతో పాటు పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకునేలా నాయకులను ప్రోత్సహించారనే చెప్పాలి.
ఓరకంగా పార్టీలో చంద్రబాబు తర్వాత మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది మొత్తం పార్టీ కార్యాలయానికి తరచుగా వెళ్లడం.. నాయకులతో భేటీ కావడం.. సమస్యలు పరిష్కరించేదిశగా అడుగులు వేయడం.. సీనియర్లకు కూడా కొన్ని విషయాల్లో హెచ్చరికలు జారీ చేయడం వంటివి పార్టీకి కలిసి వచ్చిన అంశాలుగా మారాయి. ఇవన్నీ ఇలా ఉంటే ప్రజలకు చేరువ అయ్యే విషయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు.
సాధారణంగా ఆయన తన నియోజకవర్గంలో ప్రారంభించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా నిర్వహిస్తున్నారు. ఏదైనా కార్యక్రమం నిమిత్తం మరో జిల్లాకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తొలి ప్రాధాన్యంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారంపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అంటే ఒక ప్రాంతానికి ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా సమస్య ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉన్నట్టుగా నారా లోకేష్ వ్యవహరించటం ఈ ఏడాది మొత్తంలో ఆయన గ్రాఫ్ ను మరింత పెంచిందని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates