ఉత్తర ప్రదేశ్ లోని బదాయూ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే ఆ బాధలో ఉంటారు, కర్మకాండల తర్వాత భోజనాలు చేస్తారు. కానీ ఇక్కడ ఆ భోజనమే ఇప్పుడు ఊరంతటికీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. అంత్యక్రియల సమయంలో వడ్డించిన రైతా తిన్న దాదాపు 200 మంది గ్రామస్తులు ఇప్పుడు ఆసుపత్రి బాట పట్టారు. పిప్రౌలి అనే గ్రామంలో డిసెంబర్ 23న జరిగిన ఒక అంత్యక్రియల కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దీనంతటికీ కారణం అక్కడ వడ్డించిన రైతానే. ఆ రైతా తయారీకి వాడిన పెరుగు ఒక గేదె పాల నుంచి తోడుపెట్టింది. అయితే ఆ గేదెను అంతకుముందే ఒక పిచ్చి కుక్క కరిచింది. ఆ విషయం పెద్దగా పట్టించుకోకుండా ఆ పాలతో చేసిన పదార్థాలను విందులో వడ్డించారు. సీన్ కట్ చేస్తే, ఆ గేదె డిసెంబర్ 26న అనుమానాస్పద స్థితిలో రాబిస్ లక్షణాలతో మరణించింది.
గేదె చనిపోవడంతో గ్రామస్తుల్లో భయం మొదలైంది. రాబిస్ సోకిన గేదె పాలతో చేసిన రైతా తిన్నాం కాబట్టి, మనకు కూడా ఆ వైరస్ సోకుతుందేమో అని జనం భయపడిపోయారు. వెంటనే దగ్గర్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు ముందుజాగ్రత్త చర్యగా వచ్చిన వారందరికీ యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయడం ప్రారంభించారు.
దీనిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామేశ్వర్ మిశ్రా స్పందించారు. సాధారణంగా పాలను బాగా మరిగిస్తే అందులో వైరస్ చనిపోతుంది, దానివల్ల రాబిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెప్పారు. అయినా సరే ప్రజల భయాన్ని పోగొట్టడానికి, రిస్క్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే వ్యాక్సిన్లు ఇస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.
నివారణ అనేది చికిత్స కంటే ముఖ్యం కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉంది. ఎవరికీ ఎలాంటి రాబిస్ లక్షణాలు కనిపించలేదు. అయినా సరే హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ గా ఉంది. శని, ఆదివారాలు కూడా ఆసుపత్రులు తెరిచే ఉంచి అందరికీ వైద్యం అందిస్తున్నారు. వదంతులు నమ్మవద్దని, భయపడాల్సిన పనిలేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates