అందాల అరకు హౌస్ ఫుల్

తూర్పు కనుమల నడుమ ప్రకృతి సోయగాలతో విరజిల్లుతున్న అరకు వ్యాలీ వరుస సెలవులు, ఇయర్ ఎండ్ వేడుకల నేపథ్యంలో పర్యాటకులతో కిటకిటలాడుతోంది. విశాఖపట్నం‌కు సుమారు 114 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రముఖ పర్యాటక కేంద్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. దీంతో అరకు లోయ పూర్తిగా హౌస్‌ఫుల్‌గా మారగా, హోటళ్లు, లాడ్జీలు అన్నీ నిండిపోయి రూములు దొరకని పరిస్థితి నెలకొంది.

పర్యాటకుల రద్దీ కారణంగా బొర్రా గుహల సమీపంలో, అరకు ఘాట్ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. నిన్న రాత్రి నుంచే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పరిస్థితిని నియంత్రించేందుకు అధికారులు అరకు ఘాట్ రోడ్డులో వన్‌వే ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. విశాఖపట్నం, ఎస్‌.కోట నుంచి అరకు వైపు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చి, అరకు నుంచి విశాఖ వెళ్లే వాహనాలను పాడేరు మార్గంలో మళ్లిస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఉడెన్ బ్రిడ్జి, వంజంగి వ్యూ పాయింట్‌, పద్మాపురం గార్డెన్‌, చాపరాయి, ట్రావెల్ మ్యూజియం వంటి ప్రాంతాలు సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఉదయం వేళల్లో వంజంగి వ్యూ పాయింట్ వద్ద దట్టమైన పొగమంచును ఆస్వాదించేందుకు భారీ రద్దీ కనిపించింది.

వరుస సెలవుల కారణంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికులతో నిండిపోగా, అరకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ సమస్యలు, వసతి కొరత పర్యటనకు ఆటంకంగా మారుతున్నాయి.

Image Credit – Rakesh Pulapa