టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటించగానే అందరికీ వచ్చిన పెద్ద డౌట్ ఇదే.. శుభ్‌మన్ గిల్‌ని ఫామ్ లేదని పక్కన పెట్టినప్పుడు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ని ఎందుకు ఉంచారు? నిజానికి చెప్పాలంటే గిల్ కంటే సూర్య రికార్డులే మరీ దారుణంగా ఉన్నాయి. 2025లో సూర్య ఆడిన 19 ఇన్నింగ్స్‌లలో 9 సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు. చెప్పుకోదగ్గ స్కోర్ కేవలం 47 నాటౌట్. అయినా సరే వైస్ కెప్టెన్ గిల్‌ని తీసేసి, సూర్యని మాత్రం అలాగే కంటిన్యూ చేశారు. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయి.
మొదటిది ‘కెప్టెన్సీ రికార్డ్’. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో ఫెయిల్ అవుతున్నా, కెప్టెన్‌గా మాత్రం టీమ్‌ని సూపర్ సక్సెస్ చేస్తున్నాడు. తను పగ్గాలు చేపట్టాక ఇండియా ఆడిన ప్రతి సిరీస్ గెలిచింది. శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా.. ఇలా ఎవరితో ఆడినా కప్పు మనదే. ముఖ్యంగా ఏసియా కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 7-0తో టైటిల్ కొట్టారు. జట్టు గెలుస్తున్నప్పుడు కెప్టెన్‌ని మార్చడం అంత ఈజీ కాదు.
రెండవది ‘ఇంపాక్ట్’. గిల్ క్రీజులో సెటిల్ అవ్వడానికే ఇబ్బంది పడుతుంటే, సూర్య మాత్రం వచ్చిన వెంటనే కుదురుకుంటున్నాడు, కానీ అనవసరమైన షాట్స్ ఆడి అవుట్ అవుతున్నాడు. ఒకప్పుడు ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్‌గా ఓ వెలుగు వెలిగిన సూర్య, ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడితే మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేస్తాడని సెలెక్టర్లు బలంగా నమ్ముతున్నారు.
మూడవది ‘వయసు, అనుభవం’. గిల్ వయసు 26, సూర్య వయసు 35. సూర్య కెరీర్ చివరి దశలో ఉన్నాడు, కానీ టీమ్‌ని నడిపించే సత్తా అతనిలో ఉంది. గిల్‌కి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, అతను మళ్ళీ ప్రూవ్ చేసుకుని రాగలడు. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీకి సూర్య అనుభవం చాలా అవసరం. అందుకే గిల్‌ని పక్కన పెట్టినా, సూర్య మీద నమ్మకం ఉంచారు.
సూర్య కూడా తన ఫామ్ గురించి ఆందోళనగానే ఉన్నాడు. మొన్నటి వరకు “ఫామ్ లేకపోవడం కాదు, రన్స్ రావడం లేదు అంతే” అని చెప్పిన సూర్య, ఇప్పుడు మాత్రం “అవును నేను ఫామ్‌లో లేను” అని ఒప్పుకున్నాడు. కానీ వరల్డ్ కప్ మొదలయ్యే లోపు న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో మళ్ళీ పాత సూర్యని చూస్తామని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Image Credit – ESPN Cricinfo
Gulte Telugu Telugu Political and Movie News Updates