సోషల్ మీడియా పుణ్యమా అని ఏ రోజు ఎవరు పాపులర్ అవుతారో.. ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. కేవలం రీల్స్, షార్ట్స్ ద్వారా పాపులర్ అయి టీవీ షోలు, సినిమాల్లో అవకాశాలు అందుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. దుర్గారావు అనే వ్యక్తి భార్యతో కలిసి చేస్తున్న వీడియోలు పాపులర్ అయి.. పలాస అనే సినిమాకు ప్రమోషన్ పరంగా ఉపయోగపడడం.. ఆ తర్వాత అతను తన భార్యతో కలిసి టీవీ షోల్లోనూ పాల్గొనడం.. సోషల్ మీడియాలో మరింత ఫాలోయింగ్ సంపాదించడం తెలిసిందే.
ఇటీవల అలా అనుకోకుండా బాగా పాపులర్ అయింది ఒక మిడిల్ క్లాస్ జంట. ఆర్బీహెచ్ వ్లాగర్స్ పేరుతో వీడియోలు చేసే భార్యాభర్తలు రాజశేఖర్ సినిమా ఆయుధంలో పాపులర్ అయిన ఇదేమిటమ్మా మాయా మాయా పాటకు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను ఊపేసింది. కిరణ్ అబ్బవరం సినిమా కేర్యాంప్‌లో ఈ పాటను వాడుకోగా.. రీల్స్ కోసం లక్షల మంది ఆ పాటను ఉపయోగించుకున్నారు.
ఆర్బీహెచ్ వ్లాగర్స్ జంట కూడా ఆ పాటకు డ్యాన్స్ చేసింది. ముందు భార్య స్టెప్ వేస్తుంటే.. వెనుక భర్త వేసి డ్యాన్స్ నవ్వులు పూయించింది. ఈ వీడియో సోషల్ మడియాలో ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది. కొందరు ఫారినర్స్ సైతం ఈ వీడియోను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించారు.
ఇలా పాపులర్ అయిన ఆ జంటను.. ఇప్పుడు పద్మమోహన్ టీవీ అవార్డుల కార్యక్రమంలో పెర్ఫామ్ చేయడం విశేషం.
సుమన్ సహా పలువురు సినీ, టీవీ సెలబ్రెటీలు.. రాజకీయ నాయకులు పాల్గొన్న వేడుకలో ఈ ఇద్దరూ స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి కార్యక్రమంలో ఈ డ్యాన్సులేంటి అనే కామెంట్లు కూడా వినిపించినప్పటికీ.. జస్ట్ ఒక రీల్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఈ జంట ఇక్కడిదాకా రావడం అనూహ్యం. అందులో డ్యాన్స్ చూసిన నవ్విన వాళ్లే.. ఇప్పుడు ఆ జంటకు వచ్చిన అవకాశాన్ని చూసి అవాక్కవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates