వైసీపీ అధినేత జగన్‌పై విమర్శల జోరు పెంచాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎలా ఉన్నా, గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, ప్రజలపై నిర్బంధాలు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన ఆగడాలను మరోసారి ప్రజలకు గుర్తు చేయాలని భావిస్తోంది.
జనవరి 15 నుంచి ప్రజల మధ్యకు టీడీపీ నేతలు వెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో, దీనిపై కసరత్తు పెంచిన పార్టీ నేతలు ఐదు కీలక అంశాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయనున్నారు.
1) తిరుమల:
పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని వైసీపీ హయాంలో ఏ విధంగా భ్రష్టుపట్టించారో మరోసారి ప్రజలకు వివరించనున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్న లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం, పరకామణి దొంగతనం, అలాగే అన్యమత ప్రచారాల అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అదే సమయంలో ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రజలకు చెబుతారు.
2) అమరావతి:
మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని అటకెక్కించిన తీరును ప్రజలకు మరోసారి వివరించనున్నారు. ప్రస్తుతం అమరావతి ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా ప్రజలకు తెలియజేస్తారు. అమరావతిని నాశనం చేయడం ద్వారా జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారన్న వాదనను బలంగా తీసుకువెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.
3) రుషికొండ:
విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండను తొలిచేసి ఎందుకు కొరగాని ప్యాలెస్ నిర్మించారన్న అంశాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా వివరించనుంది. ఈ ద్వారా 550 కోట్ల రూపాయల ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేశారో కూడా ప్రజలకు చెప్పనున్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజల ధనాన్ని ఎలా దోచుకున్నారో కూడా వివరించాలన్నది టీడీపీ ఆలోచన.
4) శవం డోర్ డెలివరీ:
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్‌ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనను కూడా ప్రజలకు వివరించనున్నారు. అలాగే అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ మహిళల పట్ల ఎలా వ్యవహరించారో సంబంధించిన న్యూడ్ వీడియోల అంశాన్ని మరోసారి ప్రజల ముందుకు తీసుకురావాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది.
5) చంద్రబాబు అరెస్టు:
చంద్రబాబు కుటుంబాన్ని దూషించిన తీరు, ఆయన్ను జైలులో పెట్టిన విషయాలను కూడా ప్రజల మధ్యకు తీసుకురానున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కుటుంబంపై జరిగిన విమర్శలను కూడా వివరించనున్నారు. వైసీపీ పాజిటివిటీని సాధ్యమైనంతవరకు తగ్గించాలనే లక్ష్యంతో టీడీపీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.
ఈ ప్రణాళికకు చంద్రబాబు ఆమోదం లభిస్తే, జనవరి నుంచి వచ్చే మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates