ఏపీలో ఘోరం, లోయలో పడిన బస్సు.. 9 మంది దుర్మరణం

ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజు గారి మెట్ట మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ట్రావెల్ బస్సుగా గుర్తించారు. భద్రాచలం వెళ్లి అన్నవరం వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు నగరం మిట్టూరు శ్రీ విజ్ఞేశ్వర ట్రావెల్స్ కు చెందినగా గుర్తించారు. ఈనెల ఆరవ తేదీన 38 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఏడు రోజులు పాటు పుణ్యక్షేత్రాలు సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు నగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాసులతో ఈ బస్సు బయలుదేరింది. ఘటనా స్థలిలో ప్రయాణికుల హాహాకారాలతో మార్మోగింది. పోలీసులు అక్కడికి చేరుకుని స్థానిక సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

ఘటనాస్థలికి మూడు అంబులెన్సులు, ఐదు పోలీసు వాహనాలు చేరుకున్నాయి. ప్రమాదంపై కలెక్టర్ ఎస్పీతో.. మంత్రి సంధ్యారాణి, మంత్రి అనిత మాట్లాడారు. గాయపడిన వారిని చింతూరు హాస్పటల్ కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించాలని మంత్రులు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు భరోసా ఇచ్చారు. ప్రమాదం జరగడంతో చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్డు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.