కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు ఇచ్చే బీసీసీఐ కాంట్రాక్టులలో భాగంగా, ఈసారి వీరిద్దరికీ రెండు కోట్ల రూపాయల తగ్గింపు ఉండవచ్చని సమాచారం. దీనికి కారణం వారి ఫామ్ కాదు, ఫార్మాట్ ఎంపిక. టెస్టు క్రికెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న బోర్డు నిబంధనలే ఈ కోతకు దారి తీస్తున్నాయి.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు A+ ప్లస్ (7 కోట్లు) A (5 కోట్లు), B, C అనే నాలుగు గ్రేడ్లుగా ఉంటాయి. ఇందులో A+ కేటగిరీ కేవలం మూడు ఫార్మాట్లలో అంటే టెస్టు, వన్డే, టీ20లలో రెగ్యులర్ గా ఆడే టాప్ ప్లేయర్ల కోసం మాత్రమే ఉద్దేశించింది. ఆటగాడి ఫామ్, జట్టుకు అతని కట్టుబాటు ఆధారంగా ఈ కాంట్రాక్టు గ్రేడ్‌ను నిర్ణయిస్తారు. రిటైరర్ షిప్ తో సంబంధం లేకుండా ఆడిన ప్రతి మ్యాచ్‌కు వేతనం అదనంగా చెల్లిస్తారు.

రోహిత్ కోహ్లీ ప్రస్తుతం A+ గ్రేడ్ లో ఉన్నారు. అయితే వీరిద్దరూ టెస్టు టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో వారు A+ కేటగిరీకి అనర్హులు అయ్యే ఛాన్స్ ఉంది. బోర్డు నియమాల ప్రకారం, టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీంతో వారు A+ నుంచి ఏ కేటగిరీకి డెమోట్ అయితే, వారి వార్షిక రిటైరర్ షిప్‌లో రెండు కోట్ల రూపాయలు తగ్గుతుంది. వీరిద్దరూ తప్పుకోవడంతో శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాడు A+ కేటగిరీకి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది.

రవీంద్ర జడేజా కూడా టీ20ల నుంచి రిటైర్ అయినా, టెస్టుల్లో చురుకుగా పాల్గొంటున్నందున అతను A+ లోనే కొనసాగవచ్చు. మరోవైపు, దేశవాళీ క్రికెట్‌ను పట్టించుకోని శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లను గతంలో బోర్డు కాంట్రాక్టుల నుంచి తప్పించడం జరిగింది. ఈ కాంట్రాక్టు విధానం ద్వారా బీసీసీఐ ఒక బలమైన సందేశం ఇస్తోంది. ఆటగాడి హోదా ఎంత పెద్దదైనా, జాతీయ జట్టుకు ముఖ్యంగా టెస్టు క్రికెట్‌కు చూపించే నిబద్ధతే ముఖ్యం. అలాగే ఇకపై ఐపీఎల్ చూసుకుంటే కుదరదు. టెస్టులకి కమిట్‌మెంట్ ఇవ్వని వాళ్లకి జీతం కట్ చేస్తామని బోర్డు తేల్చేసింది.