యువరాజ్ ఫోన్ చేస్తే ఆ ఆటగాడికి వణుకు

గ్రౌండ్‌లో అభిషేక్ శర్మ స్టైల్, అతడు అలవోకగా కొట్టే సిక్సర్లు చూసి అంతా ఈజీ అనుకుంటారు. కానీ ఆ ‘స్వాగ్’ వెనుక ఎవరికీ కనిపించని కఠోర శ్రమ దాగుంది. ఇప్పుడు సొంత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఈ యువ సంచలనం రాత్రికి రాత్రే స్టార్ కాలేదు. దీని వెనుక చిన్నప్పటి నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకే మొదలయ్యే ఒక పెద్ద యుద్ధమే ఉంది.

అభిషేక్ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచే ఒక ఆర్మీ ఆఫీసర్ లా ఉండేది. తన తండ్రి రాజ్‌కుమార్ శర్మ కఠినమైన శిక్షణలో అతడు పెరిగాడు. కోడి కూయకముందే నిద్రలేవడం, జిమ్, రన్నింగ్, స్విమ్మింగ్.. ఇలా ఉదయం నుంచే కుస్తీ పడేవాడు. అలసిపోయాను అనకుండా రోజంతా బ్యాట్ పట్టి నెట్స్ లో చెమటోడ్చేవాడు. ఆనాడు పడ్డ కష్టమే ఇప్పుడు మైదానంలో పరుగుల వరదలా మారుతోంది.

సాధారణంగా 11, 12 ఏళ్ల వయసులో పిల్లలు బంతిని డిఫెన్స్ చేయడం నేర్చుకుంటారు. కానీ అభిషేక్ మాత్రం ఆ వయసులోనే బౌలర్లను ఉతికి ఆరేసేవాడు. గ్రౌండ్ బయట బాల్స్ వెతకలేక సిబ్బంది విసిగిపోయేవారంటే అతడి పవర్ హిట్టింగ్ రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అప్పుడే శుభ్‌మన్ గిల్ తో కలిసి ఇతడు కచ్చితంగా ఇండియాకు ఆడతాడని కోచ్ లు జోస్యం చెప్పారు.

ఇక అభిషేక్ కెరీర్ ను మలుపు తిప్పింది మాత్రం సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్. లాక్ డౌన్ సమయంలో వీరిద్దరి ప్రయాణం మొదలైంది. అయితే యువరాజ్ దగ్గర ట్రైనింగ్ అంటే మాటలు కాదు. ఇప్పటికీ మైదానంలో అభిషేక్ ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు, యువీ వెంటనే ఫోన్ చేసి గట్టిగా క్లాస్ పీకుతాడు. ఆ తిట్లు పడతాయనే భయంతోనే అభిషేక్ మరింత క్రమశిక్షణతో ఆడుతూ రాటుదేలాడు.

బ్యాటింగ్ స్వింగ్ స్మూత్ గా రావడం కోసం గోల్ఫ్ ఆడటం అభిషేక్ కు ఉన్న మరో సీక్రెట్ అలవాటు. ఇది బ్రయాన్ లారా, యువరాజ్ నుంచి నేర్చుకున్న టెక్నిక్. కేవలం సరదా కోసం కాకుండా, తన ఆటను మెరుగుపరుచుకోవడానికి ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటున్నాడు. ఇక రానున్న కాలంలో టీమిండియాకు మరిన్ని విజయాలను అందించాలనేదే నా సంకల్పం అని అభిషేక్ చెబుతున్నాడు.