ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ డి.గుకేష్ ఇప్పుడు మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. కేవలం వరల్డ్ టైటిల్ గెలిస్తే సరిపోదు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా నంబర్ వన్ కావాలని పట్టుదలగా ఉన్నాడు. గత 14 ఏళ్లుగా ఆ స్థానంలో పాతుకుపోయిన మాగ్నస్ కార్ల్‌సన్‌ను కిందకు దించి, ఆ సింహాసనాన్ని అధిష్టించడమే తన తదుపరి లక్ష్యం అని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం గుకేష్ ర్యాంకు పదిలో ఉంది. డింగ్ లిరెన్‌ను ఓడించి ఛాంపియన్ అయినా, 2025 ఏడాది అతనికి కాస్త ఒడిదుడుకులుగానే సాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ మూడుకు చేరుకున్నా, తర్వాత వెనకబడ్డాడు. తాజాగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, నంబర్ వన్ స్థానం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను, ఫలితం ఏదైనా నా ప్రయత్నంలో లోపం ఉండదని చాలా మెచ్యూర్డ్ గా సమాధానం చెప్పాడు.
రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో తన తోటి భారతీయ ఆటగాడు ప్రజ్ఞానందాతో తలపడాలని ఉందని గుకేష్ మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పటికే ప్రజ్ఞానందా 2026 కాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. ఒకవేళ కాండిడేట్స్ టోర్నీలో ప్రజ్ఞానందా గెలిస్తే, టైటిల్ పోరులో ఇద్దరు భారతీయులే తలపడే అద్భుత దృశ్యం మనం చూడొచ్చు.
ఇదిలా ఉంటే కాండిడేట్స్ ఎంపిక విధానంపై ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతోంది. అమెరికన్ ప్లేయర్ హికారు నకమురా అర్హత సాధించడానికి చిన్న చిన్న టోర్నీలు ఆడాల్సి వచ్చింది. దీనిపై కార్ల్‌సన్ ఫిడే (FIDE) తీరును తప్పుబట్టాడు. ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్స్ అని తెలిసాక కూడా, ఇలా రూల్స్ పేరుతో చిన్న టోర్నీలు ఆడించడం పిచ్చితనమని మండిపడ్డాడు.
ఏది ఏమైనా భారతీయ చెస్ ఇప్పుడు గోల్డెన్ పీరియడ్‌లో ఉంది. ఒకపక్క గుకేష్ నంబర్ వన్ సీటు కోసం వేట మొదలుపెట్టడం, మరోపక్క ప్రజ్ఞానందా దూసుకురావడం చూస్తుంటే రాబోయే రోజుల్లో చెస్ ప్రపంచాన్ని భారతీయులే ఏలబోతున్నారని అర్థమవుతోంది. కార్ల్‌సన్ 14 ఏళ్ల సామ్రాజ్యాన్ని గుకేష్ ఎప్పుడు కూల్చేస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates