అప్పు చేయడం తప్పు కాదా?

ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు కాదు, అది లైఫ్ లో ఎదగడానికి ఒక మార్గం అని భారతీయ మధ్యతరగతి జనం ఫిక్స్ అయిపోయారు. హోమ్ క్రెడిట్ ఇండియా చేసిన సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. జనం ఇప్పుడు కష్టాలు గట్టెక్కడానికి కాకుండా, తమ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, కలలు నెరవేర్చుకోవడానికి లోన్లు తీసుకుంటున్నారు.

ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి వస్తువులు కొనడానికే ఎక్కువమంది (46 శాతం) అప్పులు చేస్తున్నారు. డిజిటల్ యుగంలో ఇవి లగ్జరీ కాదు, అత్యవసరాలుగా మారిపోవడమే దీనికి కారణం. ఇక సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని, ఉన్న బిజినెస్ పెంచుకోవాలని లోన్లు తీసుకునే వారి సంఖ్య కూడా 25 శాతానికి పెరిగింది. ఇది దేశంలో యువతలో పెరుగుతున్న వ్యాపార ఆసక్తికి నిదర్శనం.

లోన్ అప్లై చేయడానికి ఇప్పుడు ఎవరూ బ్యాంకుల చుట్టూ తిరగడం లేదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు చిటికెలో పని అయిపోతోంది. దాదాపు 51 శాతం మంది ఆన్‌లైన్ ద్వారానే లోన్లు తీసుకుంటున్నారు. ఇందులో విశేషం ఏంటంటే, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ ఫైనాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. లోన్ తీసుకునే ముందే క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం, ఈఎంఐ ఎంత పడుతుందో చూసుకోవడం వంటి ‘స్మార్ట్’ పనులు చేస్తున్నారు.

ఇప్పుడు అందరి చేతిలో ఈఎంఐ కార్డులు కామన్ అయిపోయాయి. 65 శాతం మందికి ఇదే ఫేవరెట్ ఫైనాన్స్ టూల్. ముఖ్యంగా జెన్-జీ (Gen Z) కుర్రాళ్లు, మహిళలు ఈ “ఎంబెడెడ్ ఫైనాన్స్” విధానాన్ని తెగ వాడేస్తున్నారు. అంటే ఏదైనా వస్తువు కొనగానే, అక్కడికక్కడే ఈఎంఐగా మార్చుకునే సౌకర్యం ఉండటంతో వీరికి ఇది బాగా నచ్చేసింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి సిటీల్లో ఈ ట్రెండ్ జోరుగా ఉంది.

మొత్తానికి అప్పు అనేది ఇప్పుడు ఒక బరువు కాదు, ఎదుగుదలకు ఒక మెట్టులా మారింది. సొంత ఇల్లు కొనాలన్నా, బిజినెస్ డెవలప్ చేసుకోవాలన్నా లోన్ ఉండాల్సిందే అని సగం మంది భారతీయులు బలంగా నమ్ముతున్నారు. సరైన ప్లానింగ్ తో తీసుకుంటే అప్పు కూడా మనకు హెల్ప్ అవుతుందని, అది మన కలలను సాకారం చేస్తుందని ఈ తాజా సర్వే స్పష్టం చేస్తోంది.