దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో మళ్లీ గందరగోళం మొదలైంది. ప్రయాణికులు చెక్ ఇన్ చేసుకోవడానికి కౌంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఎందుకంటే, విమానాశ్రయ వ్యవస్థలను నడిపించే ‘మైక్రోసాఫ్ట్ విండోస్’ సడెన్‌గా మొరాయించింది. దీనివల్ల కంప్యూటర్లు పనిచేయక, బోర్డింగ్ పాస్‌లు ఇవ్వడం, బ్యాగేజ్ ట్యాగింగ్ చేయడం కష్టమైపోయింది. ఫలితంగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని పూర్తిగా రద్దయ్యాయి.
ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దీని ప్రభావం గట్టిగా పడింది. ఢిల్లీ, బెంగళూరు, గోవా, మదురై వంటి నగరాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు కూడా ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. బుధవారం ఒక్క శంషాబాద్ నుంచే 19 సర్వీసులు (7 వెళ్లాల్సినవి, 12 రావాల్సినవి) రద్దయినట్లు అధికారులు తెలిపారు.
కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది పాత పద్ధతిలో ‘మాన్యువల్’గా చెక్ ఇన్ చేస్తున్నారు. చేతితో బోర్డింగ్ పాస్‌లు రాసి ఇవ్వడం వల్ల ఎక్కువ సమయం పడుతోంది. ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన సంస్థలన్నింటిపైనా ఈ ఎఫెక్ట్ పడింది. అయితే, మైక్రోసాఫ్ట్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఇటీవల జీపీఎస్ స్పూఫింగ్ కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త టెక్నికల్ గ్లిచ్ ప్రయాణికులను మరింత బెంబేలెత్తిస్తోంది. విమానాశ్రయానికి వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిదని ఎయిర్‌లైన్స్ సూచిస్తున్నాయి. టెక్నాలజీ మీద అతిగా ఆధారపడటం వల్ల ఒక్కోసారి ఇలాంటి ‘బ్లూ స్క్రీన్’ కష్టాలు తప్పవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates