విశ్వకిరీటం.. మిస్ ఇండియాకు నిరాశ!

ఎంతో ఉత్కంఠగా సాగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మెక్సికో అందగత్తె ‘ఫాతిమా బాష్’ విజేతగా నిలిచింది. తన అందం, తెలివితేటలతో జడ్జిలను మెప్పించి విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీలో థాయిలాండ్ బ్యూటీ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, వెనిజులా భామ సెకండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫిలిప్పీన్స్, కోట్ డి ఐవోర్ దేశాలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మెక్సికో గర్వించదగ్గ క్షణాలివి అంటూ మిస్ యూనివర్స్ అధికారిక పేజీలో ఆమెను అభినందించారు.

అయితే, ఈ వేదికపై భారత్‌కు మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది. మన దేశం తరఫున బరిలోకి దిగిన రాజస్థాన్ బ్యూటీ మణిక విశ్వకర్మ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. మొదట్లో టాప్ 30లో చోటు దక్కించుకుని ఆశలు రేపిన మణిక, కీలకమైన టాప్ 12 జాబితాలో మాత్రం స్థానం సంపాదించలేకపోయింది. స్విమ్ సూట్ రౌండ్ ఆమె కొంపముంచింది. వైట్ మోనోకినీలో ఆమె మెరిసినా, జడ్జిలను ఆకట్టుకోవడంలో విఫలమై రేసు నుంచి తప్పుకుంది.

శ్రీ గంగానగర్‌కు చెందిన మణిక, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. మిస్ ఇండియా యూనివర్స్‌గా ఎంపికై విశ్వ వేదికపై అడుగుపెట్టినా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల పోటీ ముందు నిలవలేకపోయింది. మిస్ పాలస్తీనా కూడా విభిన్నమైన డ్రెస్సింగ్‌తో ఆకట్టుకున్నా, ఆమె కూడా ఎలిమినేట్ అయ్యింది. మొత్తానికి ఈసారి కూడా కిరీటం మన దరిదాపుల్లోకి రాలేదు.

ఇక ఈ పోటీల్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కూడా వచ్చింది. వచ్చే ఏడాది, అంటే 2026లో జరగబోయే 75వ మిస్ యూనివర్స్ పోటీలకు ‘ప్యూర్టో రికో’ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ దేశం ఈ పోటీలను నిర్వహించడం ఇది మూడోసారి. ఈసారి మెక్సికోలో మెరిసిన కిరీటం, వచ్చే ఏడాది ఎవరి సొంతం అవుతుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఫాతిమా బాష్ విక్టరీని మెక్సికో ప్రజలు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.