ఐబొమ్మ అడ్మిన్‌ను పట్టించింది భార్యేనా?

ఐబొమ్మ‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు. కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్రాల‌తో పాటు తెలుగులో రిలీజ‌య్యే వేరే భాషా చిత్రాల‌ను కూడా పైర‌సీ చేసి క్వాలిటీ ప్రింట్లు అందిస్తూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న వెబ్ సైట్. ముందుగా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చే సినిమాల‌ను మాత్ర‌మే పైర‌సీ చేసి అందిస్తూ వ‌చ్చిన ఈ వెబ్ సైట్.. ఈ మ‌ధ్య థియేట‌ర్ల‌లో రిలీజైన సినిమాల హెచ్‌డీ ప్రింట్ల‌ను కూడా అందుబాటులోకి తేవ‌డం మొద‌లుపెట్టింది. 

విదేశాల్లో ఐపీ అడ్ర‌స్ ప‌ట్టుకోలేని లొకేష‌న్ల నుంచి ఆప‌రేట్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీక పెద్ద స‌వాలే విసిరింది ఐబొమ్మ‌. దీని మీద పోలీసులు, ఇండ‌స్ట్రీ జనాల ఫోక‌స్ పెర‌గ‌డంతో బ‌ప్పం టీవీగా పేరు మార్చుకుని పైర‌సీని కొన‌సాగిస్తూ వ‌స్తోంది. ఐతే తాజాగా భారీ పైర‌సీ రాకెట్‌ను హైద‌రాబాద్ పోలీసులు ఛేదించిన నేప‌థ్యంలో ఫోక‌స్ ఐ బొమ్మ మీదికి మ‌ళ్లింది. హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్‌గా దిగిపోతూ పైర‌సీ రాకెట్ గురించి ప్రెస్ మీట్ పెట్టిన సీవీ ఆనంద్.. ఐబొమ్మ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దాని అడ్మిన్‌ను కూడా ప‌ట్టుకుంటామ‌ని తేల్చి చెప్పారు. 

ఇప్పుడు పోలీసుల ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ఐబొమ్మ అడ్మిన్‌గా భావిస్తున్న ఇమ్మ‌డి ర‌వి హైద‌రాబాద్‌లో అరెస్ట‌య్యాడు. క‌రీబియ‌న్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్ సైట్‌ను ఇమ్మ‌డి ర‌వి న‌డిపిస్తున్న‌ట్లుగా వెల్ల‌డైంది. ఫ్రాన్స్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన ర‌విని పోలీసులు వ‌ల వేసి ప‌ట్టుకున్నారు. ఐతే ర‌వి పోలీసుల‌కు దొర‌క‌డం వెనుక అత‌డి భార్యే ఉన్న‌ట్లుగా సోషల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌వి భార్య‌తో విభేదాలు త‌లెత్తి విడాకుల దిశ‌గా అడుగులు వేశారు. దీనికి సంబంధించిన కేసు విష‌యంలోనే అత‌ను హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. 

భ‌ర్త‌తో తీవ్ర విభేదాలున్న నేప‌థ్యంలో భార్యే పోలీసులకు త‌న గురించి స‌మాచారం ఇచ్చింద‌ని.. పోలీసులు చాక‌చక్యంగా అత‌ణ్ని ప‌ట్టుకున్నార‌ని సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌వి అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయ‌ల‌ను పోలీసులు సీజ్ చేసిన‌ట్లు చెబుతున్నారు. విదేశాల్లో ఉండి ఆప‌రేట్ చేస్తుండ‌డం.. ప‌దే ప‌దే ఐపీ అడ్ర‌స్ మారుస్తుండ‌డంతో ఐబొమ్మ అడ్మిన్‌ను ప‌ట్టుకోవ‌డం పోలీసుల‌కు స‌వాలుగా మారింది. తాను పోలీసుల‌కు చిక్క‌న‌నే ధీమాతో.. ద‌మ్ముంటే న‌న్ను ప‌ట్టుకోండి అంటూ గ‌తంలో స‌వాలు కూడా విసిరాడు ర‌వి. కానీ చివ‌రికి ఇప్పుడిలా ఊహించ‌ని విధంగా దొరికిపోయాడు.