విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పనపాలెం ప్రాంతంలో చిన్న చిన్న గొడవలతో మొదలైన అత్త–కోడళ్ల మధ్య విభేదాలు చివరికి ప్రాణహానికి దారితీశాయి. ‘దొంగ–పోలీస్’ ఆట పేరుతో అత్తను సజీవదహనం చేసిన సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.
సుబ్రహ్మణ్య శర్మ, భార్య లలిత, తల్లి కనక మహాలక్ష్మి (66)తో కలిసి అప్పనపాలెంలో నివసిస్తున్నారు. అత్త తరచూ మందలించడం, గొడవపడటం వల్ల కోడలు లలిత మనస్తాపానికి గురై, అత్తను తొలగించాలని నిర్ణయించుకుందని పోలీసులు చెబుతున్నారు.
దారుణానికి ముందు లలిత గూగుల్, యూట్యూబ్‌లో “How to kill old lady” అని వెతికినట్లు దర్యాప్తులో బయటపడింది. నవంబర్ 7న రాత్రి, ఆమె తన చిన్న కుమార్తెను “దొంగ–పోలీస్” ఆట ఆడమని చెప్పి అత్తను కుర్చీలో కూర్చోబెట్టింది. “దొంగ పారిపోకూడదని” చెబుతూ తాళ్లతో ఆమెను కట్టేసి, తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించింది.
అగ్నిప్రమాదం జరిగినట్టుగా నాటకం ఆడి, దేవుడి గదిలోని దీపం పక్కన పడేసి ప్రమాదంలా చూపించింది. బయటకు వచ్చి కేకలు వేసి, తానే డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో అగ్నిలో చిక్కుకున్న మనవరాలు కూడా గాయపడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసరికి కనక మహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు.
తర్వాత ఇంటికి వచ్చిన భర్త సుబ్రహ్మణ్య శర్మ, సంఘటన తీరుపై అనుమానం వ్యక్తం చేశాడు. తన భార్యే తల్లిని చంపిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లలితపై కేసు నమోదైంది. గాయపడిన కుమార్తెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చిన్న కారణాలకే ఇంత దారుణంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates