జర్మనీలో జరిగిన ఒక షాకింగ్ ఘటనలో ఒకరికి జీవిత ఖైదు పడింది. రాత్రిపూట తన పని భారాన్ని తగ్గించుకోవడానికి నర్సుగా పని చేస్తున్న ఒక వ్యక్తి ఏకంగా 10 మంది పేషెంట్లను హత్య చేయడంతో పాటు, మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు తేలింది. ఈ దారుణం డిసెంబర్ 2023 నుంచి మే 2024 మధ్య కాలంలో పశ్చిమ జర్మనీలోని వుయెర్‌సెల్న్ ఆసుపత్రిలో జరిగింది.
44 ఏళ్ల ఈ నర్సు ఎక్కువగా వృద్ధులు, నయం కాని వ్యాధులతో బాధపడేవారికి మత్తు మందులను (మార్ఫిన్, మిడాజోలమ్) అధిక మోతాదులో ఇంజెక్ట్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. రాత్రంతా వారిని చూసుకోవాల్సిన పని లేకుండా ఉండటానికి, ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఎక్కువ కేర్ అవసరమైన పేషెంట్ల విషయంలో నర్సు విసుగు చెంది, అతను తనను తాను మరణానికి యజమానినిగా భావించాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు చెప్పారు. ఈ చర్యలు అతనిలో ప్రత్యేకమైన నేర తీవ్రతను ప్రదర్శించాయని కోర్టు పేర్కొంది. అందుకే, 15 సంవత్సరాల తర్వాత ముందస్తుగా విడుదల కావడానికి వీలు లేకుండా జీవిత ఖైదు విధించింది.
ఈ నర్సు 2020 నుంచి ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అతని షిఫ్ట్‌లో ఎక్కువ మంది రోగుల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంపై సహచర సిబ్బంది, డాక్టర్లకు అనుమానం రావడంతో విషయం కోర్టు వరకు వెళ్ళింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంత మంది రోగులు ఇలానే చనిపోయారా అని తెలుసుకోవడానికి, వారి మృతదేహాలను వెలికితీసి దర్యాప్తు చేస్తున్నారు. అదనంగా మరిన్ని కేసులు నమోదైతే, నర్సు మరిన్ని విచారణలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates