భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించినప్పుడు, తెరవెనుక ఒక వ్యక్తి అందరికంటే ఎక్కువ ఎమోషనల్ అయ్యారు.. ఆయనే టీమ్ హెడ్ కోచ్ అమోల్ అనిల్ మజుందార్. 11,000 పైగా ఫస్ట్ క్లాస్ పరుగులు సాధించినా, దేశీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగినా, అమోల్ మజుందార్‌కి ఇండియన్ టీమ్‌కు ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. అయినా, తన కోచింగ్ పవర్‌తో మహిళల జట్టుకు వరల్డ్ కప్ సాధించిపెట్టి, తన కలను నెరవేర్చుకున్నాడు.
అమోల్ మజుందార్ ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో కలిసి ముంబైలో దిగ్గజ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. 19 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీ అరంగేట్రంలో హర్యానాపై 260 నాటౌట్ తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు దాదాపు 25 ఏళ్లు నిలిచింది. తన రెండు దశాబ్దాల కెరీర్‌లో, అతను 11,167 ఫస్ట్ క్లాస్ పరుగులు, 30 సెంచరీలు చేశాడు.
అంత అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా, అతనికి అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం దక్కలేదు. దీనికి కారణం.. అప్పటి భారత మిడిల్ ఆర్డర్‌లో టెండూల్కర్, ద్రావిడ్, లక్ష్మణ్, గంగూలీ వంటి దిగ్గజాలు ఉండటమే. అందుకే, మజుందార్‌ను తరచుగా క్రికెట్ చరిత్రలో “తప్పుడు యుగంలో జన్మించిన” ఆటగాడిగా అభివర్ణిస్తారు. ముంబై క్రికెట్‌కు అతను ఒకప్పుడు కీలక ఆటగాడిగా కొనసాగారు.
2014లో రిటైర్ అయిన తర్వాత మజుందార్ కోచింగ్‌ను ఎంచుకున్నాడు. అండర్ 19, అండర్ 23 జట్లకు మెంటార్‌గా, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2023 అక్టోబర్‌లో ఆయన భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ కొత్త ఛాలెంజ్‌ను ఆయన అంగీకరించారు.
మహిళల ప్రపంచకప్ టోర్నీలో భారత్ గ్రూప్ స్టేజ్‌లో మూడు ఓటములు ఎదుర్కొన్నప్పుడు, కోచ్‌గా ఆయన స్థిరత్వం, వ్యూహాత్మక ఆలోచనలు కీలకంగా నిలిచాయి. దాంతో ప్రశాంతమైన నాయకత్వంలో, జట్టు సరైన సమయంలో పుంజుకుంది. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం, ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేయడం వెనుక మజుందార్ ప్లానింగే ఉంది. మొత్తానికి, ఆటగాడిగా దక్కని ప్రపంచకప్ కలని, కోచ్‌గా నెరవేర్చుకున్నాడు అమోల్ మజుందార్. భారత క్రికెట్‌లో అసాధారణ ప్రతిభ ఉన్న ఆటగాడిగా, కోచ్‌గా ఆయన స్థానం ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates