విరాట్ కోహ్లి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి మేటి బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ఆటగాడు. ఒక దశలో తన పరుగుల ప్రవాహం సచిన్‌ను కూడా మించిపోయింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్ అనే పేరు కూడా వచ్చింది. కానీ ఎలాంటి ఆటగాడికైనా కెరీర్లో ఏదో ఒక దశలో పతనం తప్పదు. సచిన్ కూడా కెరీర్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. కోహ్లి కూడా అందుకు మినహాయింపు కాలేకపోయాడు. తన ప్రైమ్ 2019 తర్వాత చూడలేకపోయాం.
కరోనా కాలం అతడి మీద ప్రతికూల ప్రభావం చూపిందో ఏమో కానీ.. గత ఐదారేళ్లలో ఒకప్పటి కోహ్లిని చూడలేకపోతున్నాం. అడపాదడపా మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా.. గతంలోలా ఆత్మవిశ్వాసంతో ఆడలేకపోతున్నాడు, బౌలర్ల మీద ఆధిపత్యం చలాయించలేకపోతున్నాడన్నది వాస్తవం. గత ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచాక ఆ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేసిన కోహ్లి.. కొన్ని నెలల కిందటే టెస్టులకూ టాటా చెప్పేశాడు.
ఇక వన్డేల్లో అయినా కొంత కాలం కొనసాగుతాడు అనుకుంటే.. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే రోజు ఎంతో దూరంలో లేదు అనిపిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలకు ఎన్నో ఆశలు, అంచనాలతో వెళ్లిన కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. అడిలైడ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినా అతను నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఔటయ్యాక పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అతను గుడ్‌బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ ఇక్కడ ఆడలేననే ఉద్దేశంతో అలా చేశాడా.. లేక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోబోతున్న సంకేతాలు ఇచ్చాడా అనే డిస్కషన్ నడుస్తోంది. మూడో టీ20 తర్వాత లేదా అంతకంటే ముందే అతను రిటైర్మెంట్ ప్రకటించొచ్చనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సెలక్టర్లే తన మీద వేటు వేసేలోపు అతనే ప్రకటన చేయొచ్చని.. ఒక ఉజ్వల కెరీర్‌కు తెరపడే రోజు దగ్గర్లోనే ఉందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates