ప్రపంచంలోని పాస్‌పోర్ట్‌ల బలాన్ని కొలిచే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్స్‌లో భారత్ డౌన్ అయ్యింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది ఒక దేశ పౌరులు తమ సాధారణ పాస్‌పోర్ట్‌తో ఎంత స్వేచ్ఛగా ప్రపంచ దేశాలకు ప్రయాణించవచ్చో తెలియజేసే గ్లోబల్ ర్యాంకింగ్. ఇక గత ఏడాది 80వ స్థానంలో ఉన్న భారత పాస్‌పోర్ట్, ఈసారి ఏకంగా 5 స్థానాలు తగ్గి 85వ ర్యాంక్‌కు పడిపోయింది. భారతీయ పౌరులు ఇకపై వీసా లేకుండా కేవలం 57 దేశాలకు మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉంది.
గత సంవత్సరం వీసా రహిత ప్రయాణానికి 62 దేశాలకు యాక్సెస్ ఉండగా, ఈసారి ఆ సంఖ్య తగ్గింది. మరోవైపు, సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా నిలిచి, నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. సింగపూర్ పౌరులు వీసా లేకుండా ఏకంగా 193 దేశాలకు ప్రయాణించవచ్చు. దక్షిణ కొరియా 190 దేశాలకు యాక్సెస్‌తో రెండో స్థానంలో ఉండగా, జపాన్ 189 దేశాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఈ ర్యాంకింగ్స్‌లో మొదటి 10 స్థానాల నుంచి అమెరికా పాస్‌పోర్ట్ బయటకు రావడం ఒక ముఖ్యమైన పరిణామం. గత ఏడాది ఏడో స్థానంలో ఉన్న అమెరికా, ఈసారి 180 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో 12వ స్థానానికి పడిపోయింది. మలేషియాతో కలిసి యూఎస్ 12వ స్థానాన్ని పంచుకుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి యూరోపియన్ దేశాలు టాప్ 5లో స్థానం సంపాదించుకున్నాయి.
భారత్ ఈ 85వ ర్యాంకును ఆఫ్రికా దేశం అయిన మారిటానియాతో పంచుకుంది. భారత పౌరులు వీసా లేకుండా ప్రయాణించగలిగే దేశాలలో అంగోలా, బార్బడోస్, భూటాన్, ఇండోనేషియా, మాల్దీవులు, ఫిలిప్పీన్స్, శ్రీలంక, థాయిలాండ్ వంటి దేశాలు ఉన్నాయి. భారత్‌కు వీసా రహిత ప్రయాణ దేశాల సంఖ్య తగ్గడంతో ఈ ర్యాంక్ పడిపోయింది.
ఇక మన పొరుగు దేశాల విషయానికి వస్తే, ఆయా దేశాల పాస్‌పోర్ట్‌ల బలం కూడా తక్కువగానే ఉంది. పాకిస్థాన్ 31 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో 103వ ర్యాంకులో ఉంది. బంగ్లాదేశ్ (100వ ర్యాంక్, 38 దేశాలు), నేపాల్ (101వ ర్యాంక్, 36 దేశాలు), శ్రీలంక (98వ ర్యాంక్, 41 దేశాలు) భారత్ కంటే దిగువన ఉన్నాయి. అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌గా కేవలం 24 దేశాలకు మాత్రమే యాక్సెస్‌తో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates