స్వామీజీ కోసం కిడ్నీలు ఇస్తామంటున్న సెలబ్రెటీలు

​రాధాకృష్ణుల భక్తితో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శిష్యులను సంపాదించుకున్న ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ జీ మహరాజ్‌ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలియడంతో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోనే కాకుండా అంతటా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆయనకు తమ కిడ్నీలు దానం చేస్తామని పలువురు సెలబ్రెటీలు, సాధారణ భక్తులు ముందుకు రావడం వలన ఆయన పేరు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతోంది.

​ప్రేమానంద్‌ జీ మహరాజ్‌ తన ఆరోగ్యం గురించి ఇటీవల స్వయంగా వెల్లడించారు. బిగ్‌బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌తో మాట్లాడే సమయంలో ఆయన “నాకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. నా ఆరోగ్యాన్ని సరిచేయడానికి ఛాన్స్ లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా నేను వెళ్లిపోవాలి” అని చెప్పడం భక్తులలో ఆందోళన పెంచింది. ఆయన ముఖం కొద్దిగా ఉబ్బి కనిపించడం, వాయిస్ వణుకుతుండటం వంటి వీడియోలు ఆయన అనారోగ్య పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి.  

​ప్రేమానంద్‌కు కిడ్నీ దానం చేయడానికి అనేక మంది సెలబ్రెటీలు కూడా ముందుకు వచ్చారు. బాలీవుడ్ నటుడు శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా స్వయంగా వృందావన్‌లోని ఆశ్రమానికి వెళ్లి తమ కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే మహరాజ్ అందుకు నిరాకరించారు. అంతేకాకుండా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ముస్లిం వ్యక్తి, ఆరిఫ్ ఖాన్ చిష్తి కూడా ఈ గురువు హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక అని పేర్కొంటూ, తన కిడ్నీని దానం చేస్తానని లేఖ రాయడం విశేషం. నటుడు అజాజ్ ఖాన్ కూడా ఈయన కోలుకోవాలని కోరుకుంటూ, తన కిడ్నీ దానం చేస్తానని ప్రకటించారు.

​అసలు ఈ ప్రేమానంద్‌ జీ మహరాజ్‌ ఎవరు? 

భక్తులు ఆరాధించే ఈ గురువు అసలు పేరు అనిరుద్ధ కుమార్ పాండే. చిన్నప్పటి నుంచే భక్తి, పూజలపై ఆసక్తి చూపేవారు. గీత పఠనం చేస్తూ, దైవభక్తిలో మునిగిపోయేవారు. ఇదే ఆయనను ఇంటిని వదిలి సన్యాసం స్వీకరించేలా చేసింది. వారణాసికి వెళ్లి అక్కడ చాలా మంది సాధువులతో కలిసి పూజలు, ధ్యానం చేశారు. ​ఒకరోజు ఆయనకు వృందావన్‌కు వెళ్లాలనే ఆలోచన వచ్చింది. అక్కడే ఆయనకు రాధాకృష్ణులపై లోతైన భక్తి భావన మొదలైంది. 

రాధా వల్లభ్ సెక్ట్‌లో చేరి, సాధువు మోహిత్ గోస్వామి నుంచి దీక్ష తీసుకున్న తర్వాతే ఆయన ప్రేమానంద్‌గా మారారు. అక్కడి నుంచి ఆయన తన ప్రవచన యాత్రను మొదలుపెట్టారు.

​ఆయన చెప్పే మాటలు సాధారణ ప్రజలనే కాదు, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వంటి ప్రముఖులను కూడా బాగా ప్రభావితం చేశాయి. చాలా కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహరాజ్ తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మార్నింగ్ వాక్‌లను కూడా రద్దు చేసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు.