కుల వివ‌క్ష‌కు ఏపీ ఐపీఎస్ `బ‌లి`.. దేశాన్ని కుదిపేస్తున్న `పూర‌ణ్‌` ఇన్సిడెంట్‌!

ఆయ‌న ఐపీఎస్ అధికారి. పైగా ఏపీకి చెందిన వ్య‌క్తి. తాజాగా ఈ నెల 7న ఆయ‌న త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీనికి కార‌ణం.. ప‌ని వ‌త్తిడి, మానసిక స్థితి స‌రిగా లేద‌ని తొలుత రోజు రోజంతా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ.. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న రాసిన 8 పేజీల సూసైడ్ నోట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో ఏకంగా జిల్లా ఎస్పీని స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం దేశంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం కావ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రు?  ఏం జ‌రిగింది?

ఏపీకి చెందిన పి. పూర‌ణ్‌కుమార్‌.. ఇంజ‌నీరింగ్ చ‌దివారు. అఖిల భార‌త స‌ర్వీసు ప‌రీక్ష‌లు రాసి.. 2001లో ఐపీఎస్‌కు సెల‌క్ట్ అయ్యారు. అయితే.. ఆయన ఏపీకి చెందిన వ్య‌క్తే అయినా.. హ‌రియాణా కోటాలో ఎంపిక కావ‌డంతో ఆ రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందారు. అదేస‌మ‌యంలో మ‌రో ఐఏఎస్ అధికారి అమ్నీత్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇరువురు కూడా రోహ్‌త‌క్ జిల్లాలోనే విధులు నిర్వ‌హిస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఈ నెల 7న త‌న నివాసంలోనే పూర‌ణ్‌కుమార్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

తొలుత ప‌ని ఒత్తిడి, రాజ‌కీయాలే కార‌ణ‌మ‌ని అనుకున్నా.. త‌ర్వాత కొన్ని గంట‌ల‌కు 8 పేజీల సూసైడ్ లేఖ ల‌భించింది. దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన అధికారులు నిజాలు నిర్ధారించుకున్నారు. ఈలోగా పూర‌ణ్ కుమార్ స‌తీమ‌ణి, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి.. అమ్నీత్‌.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న భ‌ర్త మ‌ర‌ణం వెనుక‌.. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులు ఉన్నార‌ని, వారి వేధింపులు, వివ‌క్ష కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని వివ‌రించారు. కానీ, పోలీసులు ఎవ‌రూ స్పందించ‌లేదు. క‌నీసం కేసు కూడా క‌ట్ట‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజా సూసైడ్ నోట్ వెలుగులోకి వ‌చ్చింది. దీనిలో పూర‌ణ్ కుమార్ ఆరోప‌ణ‌లు చేసిన వారిని త‌క్ష‌ణ‌మే ఉద్యోగాల నుంచి తొల‌గించ‌గా.. ఎస్పీని మాత్రం సస్పెన్ష‌న్‌తో స‌రిపుచ్చారు. ఇక‌, ఈ సూసైడ్ నోట్‌లో పూర‌ణ్ కుమార్ సంచ‌ల‌న విష‌యాలు రాశారు. కులం ఆధారంగా, మ‌తం ఆధారంగా తాను వివ‌క్ష‌కు గుర‌య్యాన‌ని చెప్పారు. ఎప్పుడో రావాల్సిన ప్ర‌మోష‌న్‌ను కూడా నిలువ‌రించి.. ద‌యాధ ర్మానికి ఇస్తున్న‌ట్టుగా వేధించార‌ని తెలిపారు. ప‌దే ప‌దే కులం పేరుతో వివ‌క్ష‌కు గుర‌య్యాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో సుమారు 8 మంది పేర్ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. దీని ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న స‌తీమ‌ణి డిమాండ్ చేశారు.