దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. దీంతో అందరూ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ సీనియర్ న్యాయవాది.. తన కాలి బూటును తీసి విసిరే ప్రయత్నం చేశారు. దీనిని గుర్తించిన తోటి న్యాయవాదులు .. కోర్టు భద్రతా సిబ్బంది సదరు న్యాయవాదిని అడ్డుకున్నారు. దీంతో తృటిలో పెను విపత్తు తప్పింది. అంతేకాదు.. దేశంలో ఇప్పటి వరకు నేరుగా కోర్టులలో కానీ.. బయట కానీ.. న్యాయ మూర్తులపై ఇలా చెప్పులు, బూట్లు విసిరే ప్రయత్నం ఎవరూ చేయక పోవడం గమనార్హం.
ఏం జరిగింది?
ప్రఖ్యాత పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇది పురాతత్వ శాస్త్ర శాఖ పరిధిలో ఉంటుంది. దీనిని దర్శించుకునేందుకు నిర్దేశిత సమయాలు ఉన్నాయి. అయితే.. కొన్నాళ్ల కిందట.. ఇక్కడి ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం శిరస్సును గుర్తు తెలియని దుండగులు నరికేశారు.(ఏపీలో రామతీర్థంలో ఉన్న శ్రీరాముడి విగ్రహ శిర చ్ఛేదనం మాదిరిగా) దీనిపై సుప్రీంకోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. వీటిని విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
“మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కదా.. పోయి.. ఆ దేవుడినే అడగండి. ఎవరు తల నరికారో.. ఆయనకన్నా బాగా ఎవరు చెప్పగలడు. మీరు పోయి.. ప్రార్థనలు చేసుకుంటే.. కేసు అక్కడే పరిష్కారం అవుతుంది.“ అని సీజేఐ పేర్కొంటూ.. సదరు పిటిషన్లను కొట్టి వేశారు. ఇది జరిగి కొన్నిరోజులు అయింది. అయితే.. ఈ వ్యవహారంపై మనసులో ఆగ్రహం పెంచుకున్న ఓ సీనియర్ లాయర్.. సోమవారం.. సీజేఐ ఓ కేసు విచారిస్తున్న సమయంలో అత్యంత సమీపంలోకి వచ్చి.. ఆయనపై బూటు విసిరే ప్రయత్నం చేశారు.
ఇక, ఆయనను తోటి లాయర్లు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక, కోర్టు నుంచి బయటకు వచ్చే క్రమంలో సదరు లాయర్.. “సనాతన ధర్మాన్ని అవమానించాడు.“ అని బిగ్గరగా నినాదాలు చేయడం గమనార్హం. అయితే.. ఈ వ్యవహారంతో కోర్టులో కలకలం రేగింది. దీనిని గమనించిన సీజేఐ.. ఇవన్నీ.. తాను పట్టించుకోనని, కొందరు మూర్ఖులు ఇలానే వ్యవహరిస్తారని, న్యూటన్ సిద్దాంతాన్ని తాను అవలంభిస్తానని పేర్కొంటూ.. ఇతర కేసుల విచారణలో మునిగిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates