భారత్‌ నా మాతృభూమి.. పాక్ క్రికెటర్ పోస్టు వైరల్

ఒకప్పుడు పాకిస్తాన్‌ జట్టులో స్టార్‌ స్పిన్నర్‌గా వెలుగొందిన దానిష్‌ కనేరియా, ఇప్పుడు తన మాటలతో స్వదేశంలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పాక్‌ తరఫున 2000 నుంచి 2010మధ్యలో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన ఈ లెగ్‌ స్పిన్నర్‌ తన కెరీర్‌లో 261 టెస్టు వికెట్లు సాధించాడు. కానీ ఇప్పుడు క్రికెట్‌ కన్నా వివాదాల ద్వారానే వార్తల్లో నిలుస్తున్నాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాక్‌ మధ్య ఉత్కంఠ పెరిగిన వేళ, కనేరియా భారత్‌ కు మద్దతుగా ప్రశంసలు కురిపిస్తూ, పాకిస్తాన్‌పై విమర్శలు చేయడంతో పెద్ద దుమారం రేగింది.

ఈ వివాదాల మధ్య కనేరియా తాజాగా సోషల్‌ మీడియా వేదికగా మరో క్లారిటీ ఇచ్చాడు. “నేను భారత్‌ గురించి మాట్లాడటం, పాకిస్తాన్‌ గురించి మాట్లాడకపోవడంపై చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొందరు నన్ను భారత పౌరసత్వం కోసం ఇలా చేస్తున్నానని కూడా అంటున్నారు. కానీ ఇది నిజం కాదు,” అని స్పష్టం చేశాడు. తాను పాకిస్తాన్‌ ప్రజల ప్రేమను పొందినప్పటికీ, అక్కడి అధికారులు, పీసీబీ తనపై తీవ్రమైన వివక్ష చూపారని ఆరోపించాడు. 

తాను మతపరమైన కారణాలతో అన్యాయానికి గురయ్యానని, బలవంతంగా మతమార్పిడి ప్రయత్నాలు కూడా జరిగాయని వెల్లడించాడు. భారత్‌పై తన అనుబంధం గురించి మాట్లాడిన కనేరియా, “పాకిస్తాన్‌ నా జన్మభూమి కావచ్చు, కానీ భారత్‌ నా పూర్వీకుల భూమి. అది నా మాతృభూమి, దేవాలయం లాంటిది” అని రాశాడు. 

ప్రస్తుతం తాను భారత పౌరసత్వం కోరడం లేదని, కానీ తనలాంటి వారు భవిష్యత్తులో చేయాలనుకుంటే, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) ఇప్పటికే అందుకు మార్గం చూపుతుందని గుర్తుచేశాడు. తన కామెంట్స్ పౌరసత్వం కోసం కాదని మరోసారి స్పష్టం చేసిన కనేరియా, తాను ధర్మం కోసం నిలబడతానని పేర్కొన్నాడు. “మన నైతికతను దెబ్బతీసే, మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించే దేశద్రోహులను, నకిలీ లౌకికవాదులను బహిర్గతం చేస్తాను” అని వ్యాఖ్యానించాడు. 

అలాగే తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి ధైర్యం చెబుతూ, “ప్రభు శ్రీరాముని కృపతో నేను, నా కుటుంబం సురక్షితంగా ఉన్నాం. నా విధి రాముని చేతుల్లోనే ఉంది” అని రాశాడు. మొత్తానికి, ఒకప్పుడు పాక్‌ క్రికెట్‌కి సేవలందించిన దానిష్‌ కనేరియా, ఇప్పుడు తన వ్యాఖ్యలతో ఆ దేశంలో వివాదానికి దారితీశాడు. భారత్‌ను మాతృభూమిగా పిలిచిన ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక పాక్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన అనంతరం గత కొన్నేళ్లుగా అతను UK లోనే జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.