దగ్గుమందుతో మరణాలు.. సర్కార్ సీరియస్ స్టెప్!

మధ్యప్రదేశ్‌లోని చిన్నద్వారా జిల్లాలో పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్‌ కఫ్‌ సిరప్‌ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సిరప్‌ వాడిన తర్వాత 11 మంది చిన్నారులు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సదరు మందును సూచించిన పీడియాట్రిషన్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ సోనీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఆయన ప్రభుత్వ వైద్యుడే అయినప్పటికీ తన ప్రైవేట్‌ క్లినిక్‌లో పిల్లలకు ఈ కఫ్‌ సిరప్‌ వాడమని సూచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది. మరణించిన పిల్లల్లో ఎక్కువమంది సోనీ ప్రైవేట్‌ క్లినిక్‌లోనే చికిత్స పొందినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీశాన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అనే కంపెనీపై కూడా కేసు నమోదు చేశారు. 

ఇదే కంపెనీ కోల్డ్రిఫ్‌ కఫ్‌ సిరప్‌ తయారీదారు. నమూనాలను పరిశీలించిన అధికారులు, ఆ సిరప్‌లో 48.6 శాతం డైఇథిలీన్‌ గ్లైకాల్‌ అనే అత్యంత విషపూరిత పదార్థం ఉన్నట్లు గుర్తించారు. దీనివల్లే పిల్లల కిడ్నీలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. చెన్నై డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత తమిళనాడు డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టరేట్‌ ఈ మందును “నాట్‌ ఆఫ్‌ స్టాండర్డ్‌ క్వాలిటీ”గా ప్రకటించింది. 

దీంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కోల్డ్రిఫ్ విక్రయాన్ని నిషేధించింది. అదనంగా, అదే కంపెనీ తయారు చేసిన నెక్ట్రో-డీఎస్‌ కఫ్‌ సిరప్‌ విక్రయాన్నీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ రెండు మందులపై మరిన్ని పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పిల్లల కుటుంబాల పరిస్థితి మరింత బాధాకరంగా ఉంది. సెప్టెంబర్‌ ప్రారంభంలో కొందరు పిల్లలకు జలుబు, జ్వరం వచ్చిన తర్వాత ఈ మందు వాడారు. మొదట బాగానే కనిపించినా కొద్ది రోజులకే మూత్ర విసర్జన తగ్గడం, కిడ్నీ ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల్లో డైఇథిలీన్‌ గ్లైకాల్‌ వల్లే కిడ్నీలు పాడైనట్లు నిర్ధారించబడింది. పిల్లల మరణాలతో ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది.