ఒకరోజులోనే చెక్కు క్లియరెన్స్, ఎప్పటినుండో తెలుసా?

Close-up Of Businessman Hand Filling Blank Cheque At Desk

ఆర్థిక లావాదేవీల విష‌యంలో బ్యాంకు చెక్కుల‌కు ఉన్న ప్రాధాన్యం అంద‌రికీ తెలిసిందే. ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం వంటి అనేక మాధ్య‌మాలు వ‌చ్చినా.. వాటి ద్వారా రోజుకు కేవ‌లం ల‌క్ష రూపాయ‌లు మాత్ర‌మే ట్రాన్ష్‌ఫ‌ర్ అవుతాయి. కానీ, అంత‌కు మించి లావాదేవీలు చేసుకునేందుకు, లేదా చెల్లించేందుకు.. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న సాధనం బ్యాంకు చెక్కులే. అయితే.. ఒక చెక్కును బ్యాంకులో వేసిన త‌ర్వాత‌.. అది ఎప్పుడు న‌గ‌దు రూపంలో మారుతుంద‌న్న‌ది చెప్ప‌డం క‌ష్టం. ఒక‌ప్పుడు నాలుగు నుంచి ఐదు రోజుల స‌మ‌యం ప‌ట్ట‌గా.. ఎంత ఆధునిక సాంకేతిక‌త అందుబాటులోకి వ‌చ్చినా.. ఇప్పుడు కూడా రెండు నుంచి నాలుగు రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతోంది.

దీనివ‌ల్ల వినియోగ‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ల్యాండ్ మార్క్ డెసిష‌న్‌గా పేర్కొంటున్న ఈ కొత్త త‌ర‌హా నిబంధ‌న ప్ర‌కారం.. చెక్కులు వేసిన రోజే న‌గ‌దు రూపంలోకి మార‌నున్నాయి. వచ్చే అక్టోబ‌రు నెల నుంచి ఆర్బీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధన ప్ర‌కారం కేవలం కొన్ని గంటల్లోనే ఖాతాదారులకు సొమ్ము చేతికి అందనుంది. ఏదైనా బ్యాంకులో చెక్కు వేసిన రోజే దానిని పరిష్కరించి.. న‌గ‌దు ఉందో లేదో చూసుకుని.. కేవలం గంటల వ్యవధిలోనే నిర్దేశిత బ్యాంకు ఖాతాలోకి సొమ్ము జమచేస్తారు.

చెక్కుల పరిష్కారంలో మైలురాయిగా ఆర్బీఐ చెబుతున్న ఈ నిబంధన అక్టోబరు 4వ తేదీ నుంచి అమలులోకి రానుంది. దీని ప్ర‌కారం.. రియల్ టైమ్ మోడ్ లో చెక్కులను పరిష్కరించనున్నారు.  ఈ విధానంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బ్యాంకులో జమ చేసే చెక్కులను ఎప్పటికప్పుడు స్కాన్ చేసి సెంట్రల్ క్లియరింగ్ హౌస్ కు పంపిస్తారు. ఆ వెంటనే సెంట్రల్ క్లియరింగ్ హౌస్ సదరు చెక్కు స్కానింగ్ చిత్రాన్ని సంబంధిత బ్యాంకుకు పంపిస్తుంది. సదరు బ్యాంకు వెంటనే చెక్కును నిర్ధారించి సొమ్ము జమ చేసే విషయాన్ని రాత్రి 7 గంటలలోపే స్పష్టం చేయాలి.

ఒకవేళ నిర్దేశిత సమయానికి బ్యాంకు స్పందించకపోతే… చెక్కును అనుమతించినట్లుగా భావించి తదుపరి ప్రక్రియను చేపడతారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల మధ్య ప్రతి గంటకూ చెక్కుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చెక్కు క్లియరెన్స్ ప్రక్రియ పూర్తయిన గంట వ్యవధిలోనే నిర్ణీత సొమ్మును ఖాతాలో జమ చేస్తారు. ఈ నూత‌న విధానాన్ని రెండు ద‌శ‌ల్లో అమ‌లు చేయ‌నున్నారు. తొలిదశలో అక్టోబరు 4 నుంచి జనవరి 2 వరకు చెక్కుల పరిశీలన సమయాన్ని ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు కేటాయించగా, రెండో ద‌శ‌లో జనవరి 3 నుంచి కేవలం 3 గంటల సమయం మాత్రమే నిర్దేశించారు. మొత్తంగా చెక్కుల స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌నున్నారు.