ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న ఆ జెట్‌కు వీడ్కోలు

భారత వైమానిక దళానికి ఆరు దశాబ్దాలుగా తోడుగా నిలిచిన మిగ్ 21 జెట్‌కు శుక్రవారం వీడ్కోలు పలికారు. 1963లో సేవలు ప్రారంభించిన ఈ యుద్ధవిమానం ఎన్నో యుద్ధాల్లో భారత గగనతలాన్ని కాపాడింది. పాకిస్థాన్‌తో జరిగిన నాలుగు యుద్ధాల్లోనూ మిగ్ 21 కీలక పాత్ర పోషించింది. తన వేగం, శక్తి, చురుకుదనంతో ఇది దేశ రక్షణలో నిజమైన యోధుడిగా నిలిచింది.

చండీగఢ్‌లో మిగ్ 21 చివరి ఫ్లైట్ నిర్వహించారు. ఎందుకంటే ఇదే ప్రదేశంలో మొదటిసారి ఈ జెట్ భారత వైమానిక దళంలో చేరింది. ఆరు బైసన్ వేరియంట్లు చివరి సారి ఎగిరాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ ఫ్లైట్‌కు వాటర్  కానన్ సెల్యూట్ ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

1963 నుంచి ఇప్పటివరకు 1,200కుపైగా మిగ్ 21లు భారత వైమానిక దళంలో సేవలందించాయి. యుద్ధం, రక్షణ, గూఢచారి మిషన్లు, పైలట్ శిక్షణ ఇలా అనేక రంగాల్లో ఇవి వాడబడ్డాయి. ఒక దశలో భారత వైమానిక దళాన్ని ‘మిగ్ ఎయిర్ ఫోర్స్’ అని కూడా పిలిచేవారు. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఎన్నో మార్పులు చేసుకుంటూ మిగ్ 21 చాలా కాలం కొనసాగింది. ఇది ఇండో రష్యా రక్షణ సంబంధాల ప్రతీకగా కూడా నిలిచింది.

అయితే చివరి దశలో ఈ విమానానికి ‘ఫ్లయింగ్ కాఫిన్’ అనే ముద్ర పడింది. తరచూ జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం కారణంగా విమర్శలు వచ్చాయి. 2023లో రాజస్థాన్‌లో జరిగిన ఒక ప్రమాదంలో ముగ్గురు గ్రామస్తులు మృతి చెందారు. ఇలాంటి ఘటనల కారణంగా ఓల్డ్ అయ్యిందని ఈ విమానాన్ని రిటైర్ చేయాల్సిన అవసరం వచ్చింది.

అయినా మిగ్ 21 చేసిన సేవలను మరవలేం. ఒకప్పుడు కొత్తగా ఎదుగుతున్న భారత వైమానిక దళానికి ఇది ప్రధాన బలం. ఎన్నో తరాల పైలట్లకు ఇది శిక్షణ ఇచ్చింది. ఇప్పుడిది ఆకాశాన్ని విడిచిపెడుతున్నా, దాని వారసత్వాన్ని తేజస్‌ వంటి స్వదేశీ జెట్లు కొనసాగించనున్నాయి. మిగ్ 21 ఇక ఎగరదు కానీ, భారత రక్షణ చరిత్రలో దీని పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పవచ్చు.