ఆసియా కప్‌లో ఇప్పటికే రెండు సార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్ ఇప్పుడు ఫైనల్‌లో మూడోసారి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీగ్ దశలోనూ, సూపర్ 4లోనూ సూర్యకుమార్ సేన ఆధిపత్యం చాటినా, ఫైనల్ వాతావరణం మాత్రం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. కాబట్టి జట్టు ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు.
పాకిస్థాన్ బౌలింగ్ లైన్‌అప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అందరికీ తెలిసిందే. బ్యాటింగ్‌లో కాస్త వీక్‌గా కనిపించినా, బౌలర్లు మ్యాచ్‌ను తిప్పేసే సామర్థ్యంలో ఉన్నారు. ఇక భారత్ విషయానికి వస్తే, బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఫైనల్ ఒత్తిడి, పరిస్థితులు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే సూర్యకుమార్ అండ్ కో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే.
ఈసారి మరో అంశం ఎక్కువగా చర్చనీయాంశమైంది. సూర్యకుమార్ చేసిన పహల్గాం కామెంట్స్, మ్యాచ్ అనంతరం ‘నో షేక్ హ్యాండ్’ కౌంటర్ వల్ల పాక్ ఆటగాళ్లలో, అభిమానుల్లో ఉగ్ర వేడి గట్టిగానే ఉంది. ఫైనల్‌లో ఏ చిన్న తప్పిదం జరిగినా ఆగ్రహం రెట్టింపు అవుతుంది. అందుకే టీమ్ ఇండియా పట్టు వదులుకోకుండా ఆడాలి. గత రికార్డులు చూస్తే ఇతర టోర్నీల ఫైనల్ ఫైట్స్ లలో పాకిస్థాన్‌దే పైచేయి కనిపిస్తుంది. ఆ సెంటిమెంట్ పరంగా చూస్తే డేంజర్ అనే చెప్పాలి.
ఇండియా vs పాక్ ఫైనల్స్.. గత టోర్నీల రికార్డులు ఇలా ఉన్నాయి.
1985 వరల్డ్ ఛాంపియన్‌షిప్: భారత్ 8 వికెట్లతో విజయం
1986 ఆస్ట్రల్ ఆసియా కప్: పాకిస్థాన్ 1 వికెట్‌తో విజయం
1991 విల్స్ ట్రోఫీ: పాకిస్థాన్ 72 పరుగులతో విజయం
1994 ఆస్ట్రల్ ఆసియా కప్: పాకిస్థాన్ 39 పరుగులతో విజయం
1998 సిల్వర్ జూబిలీ కప్ (1వ ఫైనల్): భారత్ 8 వికెట్లతో విజయం
1998 సిల్వర్ జూబిలీ కప్ (2వ ఫైనల్): పాకిస్థాన్ 6 వికెట్లతో విజయం
1998 సిల్వర్ జూబిలీ కప్ (3వ ఫైనల్): భారత్ 3 వికెట్లతో విజయం
1999 పెప్సీ కప్: పాకిస్థాన్ 123 పరుగులతో విజయం
1999 కోకా కోలా కప్: పాకిస్థాన్ 8 వికెట్లతో విజయం
2007 ఐసీసీ వరల్డ్ T20: భారత్ 5 పరుగులతో విజయం
2008 కిట్‌ప్లీ కప్: పాకిస్థాన్ 25 పరుగులతో విజయం
2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్ 158 పరుగులతో విజయం
అయితే ఈసారి మాత్రం కథ మారవచ్చని నమ్మకం పెరిగింది. ఎందుకంటే గత పది మ్యాచ్‌లలో ఇండియా ఎనిమిది సార్లు పాక్‌పై గెలిచింది. ఇది ప్రస్తుత జట్టు శక్తిని సూచించే గణాంకం. అలాగే ప్రస్తుత స్క్వాడ్‌లో అనుభవం గల ఆటగాళ్లు, యూత్ ఉండటం వల్ల టీమ్ బలంగా కనిపిస్తోంది. కానీ అభిషేక్ తప్ప మిగతా ఆటగాళ్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్ రాలేదన్నది ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సూర్యకుమార్, సంజూ శాంసన్ ఫామ్‌లోకి వస్తే జట్టు మరింత శక్తివంతంగా మారుతుంది. ఇక బౌలింగ్ పరంగా చూసినా బుమ్రా, కుల్దీప్, వరుణ్ కట్టడి చేసే శక్తి ఉన్నవారు. ఏదేమైనా బైకాట్ నినాదం నుంచి ఇండియా vs పాక్ ఫైనల్ వరకు వచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates