ఆసియా కప్ 2025లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ శ్రీలంకకు విజయం తెచ్చిపెట్టినా.. జట్టులోని యువ క్రికెటర్ డునిత్ వెలలాగే (Dunith Wellalage) వ్యక్తిగతంగా తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అబుధాబి వేదికగా జరిగిన ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అతని తండ్రి సురంగ వెలలాగే గుండెపోటుతో కన్నుమూశారు. అయితే ఈ విషయం ఆటగాడికి మ్యాచ్ అనంతరం మాత్రమే తెలియజేయబడింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కోచ్ సనత్ జయసూర్యా స్వయంగా వెలలాగే భుజంపై చేయి వేసి ఈ విషాదాన్ని చెప్పిన దృశ్యం కనిపిస్తోంది. డునిత్ తండ్రి సురంగ కూడా ఒకప్పుడు క్రికెటర్‌గానే గుర్తింపు పొందారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజ్ తరఫున కెప్టెన్‌గా వ్యవహరించారు. అదే కాలంలో జయసూర్యా సెంట్ పీటర్స్ తరఫున జట్టును నడిపించాడు.
ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ లైవ్ కామెంటరీలో వెల్లడిస్తూ, “డునిత్ తండ్రి కూడా మంచి ఆటగాడు. కానీ జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. ఇప్పుడు ఈ విషాద వార్త డునిత్ కెరీర్ ప్రారంభ దశలోనే అతనికి పెద్ద దెబ్బ” అని వ్యాఖ్యానించారు. వెలలాగే ఆ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. నాలుగు ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు.
ముఖ్యంగా సీనియర్ ఆటగాడు మొహమ్మద్ నబీ ఒకే ఓవర్‌లో అతనిపై ఐదు సిక్స్‌లు బాదాడు. అయినా కూడా జట్టు మొత్తంగా బలంగా ఆడి విజయాన్ని సాధించింది. కానీ ఆ విజయోత్సాహం డునిత్ కోసం ఒక్కసారిగా విషాదంగా మారింది. సహచరులు అందరూ అతనికి ధైర్యం చెబుతూనే కనిపించారు. ఈ టోర్నీలో శ్రీలంక జట్టు సూపర్ 4కు చేరింది. కానీ వెలలాగేకు వ్యక్తిగతంగా ఇది చాలా క్లిష్ట సమయం. తండ్రి ఆకస్మిక మరణం అతనికి మానసికంగా గట్టి పరీక్ష. ఇకపై జట్టుతోపాటు తన ఆటపై మరింతగా దృష్టిపెట్టి, ఈ బాధను జయించాలని సహచరులు ఆకాంక్షిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates