కేరళలో ఇటీవల ఆందోళన కలిగించే వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ‘బ్రెయిన్ ఈటింగ్ ఆమీబా’ అనే సూక్ష్మక్రిమి కారణంగా ఇప్పటివరకు 61 కేసులు నమోదు కాగా, 19 మంది మరణించారు. మెదడును నేరుగా ప్రభావితం చేసే ప్రైమరీ ఆమీబిక్ మెనింగోఎన్సెఫలిటిస్ (PAM) అనే ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుంది కానీ వస్తే ప్రాణాపాయం తప్పదు. ముఖ్యంగా నిల్వ నీటిలో ఈ ఆమీబా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఈ వ్యాధి పెద్ద పబ్లిక్ హెల్త్ చాలెంజ్‌గా మారిందని అన్నారు. ఇంతకుముందు కొజికోడ్, మలప్పురం జిల్లాల్లో కేసులు ఎక్కువగా కనిపించగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చెల్లాచెదురుగా బయటపడుతున్నాయి. బాధితుల్లో 3 నెలల శిశువుల నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. ఒకే ప్రాంతంలో క్లస్టర్ కేసులు కాకుండా ఒక్కోచోట ఒక్కో కేసు రావడం వల్ల పరిశోధనల్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.
ఈ వ్యాధి ఎలా వస్తుంది?
PAM అనేది మెదడును తీవ్రంగా దెబ్బతీసే ఇన్ఫెక్షన్. కంటామినేట్ అయిన నీటిలో ఈ ఆమీబా ఉంటుంది. ముఖ్యంగా వేసవికాలంలో గోరువెచ్చని లేదా నిల్వ నీటిలో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఈ నీటిలో ఈత కొట్టే సమయంలో ముక్కు ద్వారా ఆమీబా శరీరంలోకి ప్రవేశించి నేరుగా మెదడుకి చేరుతుంది. తాగిన నీటివల్ల మాత్రం ఈ ఇన్ఫెక్షన్ రాదు. కాబట్టి, బావులు, ట్యాంకుల వంటి నీటిలో ఈత, స్నానం చేయడమే పెద్ద రిస్క్.
లక్షణాలు
మొదట జ్వరం, తలనొప్పి, వాంతులు, వికారంగా ఉంటాయి. సాధారణ మెదడు జ్వరం (మెనింగిటిస్)లా కనిపిస్తాయి. కానీ ఆపై చాలా వేగంగా ప్రాణాపాయం కలిగిస్తాయి. ఒకటి నుంచి తొమ్మిది రోజుల్లో లక్షణాలు కనిపించి, 24 నుంచి 48 గంటల్లోనే తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. మెదడు ఉబ్బరం, ఆలోచనలో లోపం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. సమయానికి చికిత్స అందకపోతే రోగి ప్రాణాలు నిలవవు.
చికిత్సలో సవాళ్లు ఎక్కువే. ఇప్పటివరకు బతికిన వారు చాలా తొందరగా డిటెక్ట్ చేసి యాంటీ మైక్రోబయిల్ మందుల కాక్‌టెయిల్ ఇచ్చినవారే. రోగాన్ని గుర్తించడానికి ఆలస్యం కావడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్త మెదడు అవరోధాన్ని దాటగల మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుగా గుర్తించడం తప్పనిసరి.
ప్రస్తుతం కేరళ ప్రభుత్వం, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌తో కలిసి పర్యావరణ నమూనాలు సేకరించి పరిశీలిస్తోంది. ప్రజలకు సలహా ఏమిటంటే.. కొలనులు, బావులు, చెరువుల వంటి నీటిలో ఈత, స్నానం చేయకూడదు. తప్పనిసరిగా అయితే ముక్కులోకి నీరు వెళ్లకుండా నోస్ క్లిప్స్ వాడాలి. బావులు, నీటి ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలి. లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కేరళలో 2016 వరకు కేవలం 8 కేసులే రాగా, 2023లో ఒక్కసారిగా 36 కేసులు, 9 మరణాలు జరిగాయి. ఈ ఏడాది మాత్రం 61 కేసులు, 19 మరణాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా నీటి ఉష్ణోగ్రతలు పెరగడం, ప్రజలు నీటిలో ఎక్కువ సమయం గడపడం వల్ల ఈ వ్యాధి మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates