యూనైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) రాజధాని లండన్ లో అనూహ్య రీతిలో చోటు చేసుకున్న నిరసన ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. యూకే చరిత్రలోనే అతి పెద్ద నిరసనగా దీన్ని అభివర్ణిస్తున్నారు. వలసలకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో లండన్ రోడ్లపైకి 1.10 లక్షల మంది వచ్చి నిరసన తెలిపారు. దీనికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజిమ్ పేరుతో మరో నిరసన జరిగింది లండన్ లోనే. కాకుంటే.. ఈ నిరసనకు మద్దతుగా 5 వేల మంది మాత్రమే పాల్గొన్నారు.
సెంట్రల్ లండన్ లో అక్కడి కాలమానం ప్రకారం శనివారం చోటుచేసుకున్న ఈ నిరసనకు వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్ డమ్ పేరుతో ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనల్లో అమెరికా.. ఇజ్రాయెల్ జెండాల్ని కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. అంతేకాదు.. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ విధానాల్ని తప్పుపడుతూ నినాదాలు చేశారు. వలసల్ని వెంటనే వెనక్కి పంపేయాలంటూ వలసలకు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న ప్లకార్డుల్ని పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఈ నిరసనల్లో పాల్గొన్న వారిలో కొందరు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే క్యాప్షన్ ఉన్న టోపీల్ని ధరించటం గమనార్హం.
ఇటీవల కాలంలో బ్రిటన్ కు అక్రమ వలసలు భారీగా పెరిగాయి. ఒక అంచనా ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 28 వేల మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ కు చేరుకున్నట్లుగా కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ఇలా వలసలు పెద్ద ఎత్తున చేరుకోవటంపై స్థానిక జనాభా ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు.. వలసల్ని ప్రభుత్వం హోటళ్లలో ఉంచటాన్ని తప్పు పడుతున్నారు. అక్రమ వలసలు దేశానికి భారంగా మారినట్లుగా యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు మండిపడుతున్నారు.
ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన టామీ రాబిన్ సన్ కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖుల మద్దతు ఉందన్న వార్తలు వస్తున్నాయి. వలసదారులు దేశ వనరుల్ని వాడేస్తున్నారని.. స్థానిక ఉద్యోగాల్ని కొల్లగొడుతున్నట్లుగా నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆర్థికవ్యవస్థ తీవ్రకష్టాల్లో ఉంటే.. అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారటమేకాదు.. తమ జాతీయ గుర్తింపు.. సాంస్క్రతి విలువలు ప్రమాదంలో పడుతున్నట్లుగా భావిస్తున్నారు. నిరసనకారులకు నాయకత్వం వహిస్తున్న టామీ రాబిన్సన్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
వలసలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారికి వ్యతిరేకంగా ‘‘స్టాండ్ అప్ టు రేసిజమ్’’ పేరుతో నిరసన చేపట్టారు. ఇందులో కేవలం 5 వేల మంది మాత్రమే పాల్గొన్నారు. వీరు తమ నిరసనలు తెలిపే వేళలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పోలీసుల ముందస్తు జాగ్రత్తల కారణంగా ఈ రెండు వర్గాలు ఒకరి ఎదుట మరొకరు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోటాపోటీగా నిరసనలు నిర్వహించిన నిరసనకారులు ఎదురుపడి ఉంటే పెద్ద సమస్యగా మారటమే కాదు శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యేదని చెబుతున్నారు.
స్టాండ్ అప్ టు రేసిజమ్ పేరుతో నిరసనలు తెలిపిన ఐదువేల మంది సమూహం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారిపై వాటర్ బాటిళ్లు.. ప్లకార్డులతో దాడికి పాల్పడ్డారు. ఈ అల్లర్లతో దాదాపు 26 మంది పోలీసు అధికారులు గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతునారు. ఈ అల్లర్లకు కారణమైన వారిలో పాతిక మందిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. వలసలకు వ్యతిరేకంగా యూకే చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీ రానున్న రోజుల్లో తీవ్రమైన రాజకీయ పరిణామాలకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates