నేపాల్‌లో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రారంభమైన ఆందోళనలు.. సదరు నిషేధాన్ని ఎత్తి వేసిన తర్వాత కూడా కొనసాగడమే కాకుండా.. మరింత పేట్రేగుతున్నాయి. సైన్యం కాల్పులకు తెగబడుతున్నా.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా.. ఆందోళన కారులు ముఖ్యంగా యువత ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా దేశ రాజధాని ఖఠ్మండూలోని మాజీ ప్రధాన మంత్రి ఝలనాథ్ ఖనాల్ నివాసానికి నిప్పు పెట్టారు. లీటర్ల కొద్దీ పెట్రోల్‌ను ఇంటిపై కుమ్మరించి నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు భగ్గుమన్నాయి. దీంతో ఈ మంటల్లో చిక్కుకుని.. ఖనాల్ సతీమణి.. రాజ్యలక్ష్మి చిత్రకార్ సజీవ దహనమయ్యారు.
ఈ పరిణామంతో దేశంలో మరింత తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మంటల్లో చిక్కుకుని కొనప్రాణంతో ఉన్న రాజ్యలక్ష్మిని హుటాహుటిన సైనిక అధికారులు.. ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు.. తాజాగా రాజీనామా చేసిన ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి ఇంటికి కూడా ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఆయన దొడ్డి దారి నుంచి తప్పించుకుని.. సైనికుల వాహనం ద్వారా బంకర్లకు పారిపోయారు. ప్రస్తుతం ఓలి కేబినెట్ మంత్రులు సహా.. ఉన్నతస్థాయి అధికారులు కూడా సైనిక రహస్య స్థావరాల్లో తలదాచుకుంటున్నారు.
సోషల్ మీడియాపై స్వల్పకాలిక నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారడంతో, నేపాల్ ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి మంగళవారం రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వంపై విమర్శలు, అవినీతి మరకలు కూడా ఇప్పుడు తెరమీదికి వచ్చాయి. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్ (65 ఏళ్లు)ను రాజధాని వీధుల్లో వెంబడించి మరీ ఆందోళన కారులు తరిమి కొట్టారు. అనేక సోషల్ మీడియా సైట్‌లను బ్లాక్ చేయడంపై ఆగ్రహంతో ఉన్న యువత రాజధానిని చుట్టుముట్టింది. ఈ క్రమంలో సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఆందోళనల నేపథ్యంలోనే సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని సోమవారం రాత్రి ఎత్తివేశారు. అయినా.. నిరసనలు కొనసాగాయి, ప్రదర్శనకారులు నేపాల్ అగ్ర నాయకుల ఇళ్లకు, పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. ఖాట్మండులోని విమానాశ్రయాన్ని మూసి వేశారు. ఆర్మీ హెలికాప్టర్లు, వాహనాల ద్వారా కొంతమంది మంత్రులు బంకర్లకు చేరుకున్నారు. నిరసనలు తీవ్రమవడంతో, ప్రధాన మంత్రి రాజీనామా చేశారు. ఇదిలావుంటే.. ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వం బ్లాక్ చేసిన తర్వాత కూడా సదరు సంస్థలు దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ప్రస్తుత పరిణామాలు తీవ్ర తరం కావడంతో సైన్యం పాలనను తన చేతిలోకి తీసుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates