ప్రో కబడ్డీ లీగ్ 2025 మూడో రోజునే రగడ మొదలైంది. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్ దలాల్ తన సూపర్ రైడ్‌లతో 21 పాయింట్లు సాధించి జట్టుకు 54-44తో గెలుపు అందించాడు. కానీ ఈ మ్యాచ్‌లో చివరి క్షణాల్లో ఆయన చేసిన సంబరాలు చర్చనీయాంశం అయ్యాయి. హరియాణా స్టీలర్స్ కోచ్ మన్‌ప్రీత్ సింగ్ వైపు మీసం తిప్పి, తొడ కొట్టి చూపించడం కబడ్డీ అభిమానులందరినీ కట్టిపడేసింది.
మ్యాచ్ చివరి రైడ్ సమయంలో దేవాంక్ నేరుగా హరియాణా బెంచ్ వైపు తిరిగి తొడ కొడుతూ, మీసం తిప్పుతూ వారిని ఉద్దేశించినట్టే స్పందించాడు. మన్‌ప్రీత్ కూడా చిరునవ్వుతోనే మీసం తిప్పి రిప్లై ఇచ్చాడు. ఇంతకుముందు నుంచే ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో, ఆ క్షణం ప్రత్యేకంగా నిలిచింది. మ్యాచ్ పూర్తికాగానే దేవాంక్ నేరుగా కారిడార్ దారిన వెళ్లిపోయాడు.
దేవాంక్ ను బెంగాల్ 2.2కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇతనే ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో రెండవ ప్లేయర్. నెంబర్ వన్ లో మహ్మద్రెజా షాద్లౌయ్ ను గుజరాత్ జెయింట్స్ రూ 2.23 కోట్లకు దక్కించుకుంది.
అయితే మ్యాచ్ తర్వాత మీడియా ఎదుట మన్‌ప్రీత్ మాట్లాడుతూ, “ మ్యాచ్ గెలవడం ఒక్కటే కాదు, ట్రోఫీ గెలవడమే అసలు విషయం. చిన్నోడు తండ్రిని అనుకరించాలని చూస్తే దెబ్బలు తినాల్సిందే’’ అంటూ కౌంటర్ విసిరాడు. దీనికి దేవాంక్ సమాధానం బహిరంగంగానే ఇచ్చాడు. “మన్‌ప్రీత్ సాబ్ మ్యాచ్ ముందు ఎక్కువ బిడ్ దక్కిన ఆటగాళ్లు ఫెయిల్ అవుతారు’ అని అన్నాడు. అది నేరుగా నన్ను ఉద్దేశించే మాటే. అందుకే నేను రిప్లై ఇచ్చాను” అని చెప్పాడు.
అంతే కాకుండా నా కొత్త జట్టు, కొత్త కోచ్‌తో కొత్త సీజన్ మొదలైంది. గత సీజన్ ఒత్తిడిని మర్చిపోయా అని దేవాంక్ స్పష్టం చేశాడు. మొత్తానికి, బెంగాల్ వారియర్స్ కెప్టెన్ తన రైడ్‌లతోనే కాకుండా, ధైర్యంగా చేసిన సంబరాలతో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ పీకేఎల్ 2025కి మరింత హీట్ తెచ్చి పెట్టింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates