భారత్ – చైనా సంబంధాలు ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటాయి. పొరుగు దేశాలైన ఇరు దేశాలు భౌగోళికంగా, ఆర్థికంగా విడదీయరాని సంబంధం కలిగి ఉన్నా, సరిహద్దు ఉద్రిక్తతలు తరచూ సమస్యగా మారాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఏర్పడిన అవిశ్వాసం ఇంకా పూర్తిగా తొలగలేదు. అయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల విరామం తర్వాత చైనా పర్యటన చేయడం, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో పాల్గొనడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.
చైనా పైకి ఎంత స్నేహంగా నటించినా డ్రాగన్ విషం కనిపిస్తూనే ఉంటుంది. అ దేశం వ్యూహం ఎప్పటినుంచో స్పష్టమే. భారత్‌ను ఎదగనీయకుండా అడ్డుకోవడం, ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుపడటం, పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదానికి పరోక్ష బలం చేకూర్చడం వంటి చర్యలతో చైనా తన దారిని నడిపిస్తోంది. పైకి స్నేహం చూపినా వెనుక నుంచి దెబ్బ కొట్టడం డ్రాగన్ శైలే. ఆర్థికంగా, సైనికంగా బలపడుతున్న చైనా తన ఆధిపత్యం కాపాడుకోవడానికి భారత ప్రయోజనాలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తూనే ఉంది.
జిన్‌పింగ్ కూడా తన లెక్కల ప్రకారం ముందుకు వెళ్తున్నారు. 2019లో భారత్ పర్యటన చేసిన కొద్దికాలానికే గల్వాన్ ఘటన జరిగింది. భారత్ బలహీనంగా ఉందని భావించి దుస్సాహసానికి పాల్పడ్డ చైనా చివరికి వెనుకడుగేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అమెరికా ఒత్తిళ్లు, దేశీయ రాజకీయ సమస్యలతో జిన్‌పింగ్ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత్‌తో సఖ్యతకు తాత్కాలికంగా అయినా ప్రయత్నించక తప్పని పరిస్థితి వచ్చింది.
ఇదే సమయంలో భారత్ అమెరికా సంబంధాలు కూడా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత కొత్త మలుపు తిరుగుతున్నాయి. సుంకాల పెంపు, వ్యంగ్య వ్యాఖ్యలతో ఇండియాపై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్ వైఖరి దిల్లీకి ఆందోళన కలిగిస్తోంది. కానీ భారత్ తన ప్రయోజనాలను బట్టి వ్యూహాలను మార్చుకుంటోంది. రష్యా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో కలిసి బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలపరచడం ద్వారా అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయాలన్నది మోదీ ప్రధాన ఉద్దేశం.
మొత్తానికి చైనాను పూర్తిగా నమ్మే పరిస్థితి ఇప్పటికీ లేదు. కానీ వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కొన్ని సందర్భాల్లో సహకారం తప్పనిసరి. మోదీ పర్యటన కూడా అదే దిశగా ఉంది. ఇరుదేశాలు సహకారం పోటీ మధ్యే తమ సంబంధాలను కొనసాగించుకోవాల్సిందే. శాశ్వత స్నేహం సాధ్యంకాదనే నిజం ఉన్నా, అవసరమైనప్పుడు మిత్రుడిగా, ప్రమాదంలో శత్రువుగా ఉండే డ్రాగన్‌తో జాగ్రత్తగా ముందుకెళ్లడమే భారత వ్యూహం అని అర్ధమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates